గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (17:18 IST)

కొలంబో టెస్ట్ : శ్రీలంక టార్గెట్ 386... ఇషాంత్ శర్మ నిప్పులు...

కొలంబో వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు పట్టుసాధించినట్టే కనిపిస్తోంది. 386 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఆరో బంతికి ఓపెనర్ ఉపుల్ తరంగ పేసర్ ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ప్రజ్ఞాన్ ఓజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కరుణరత్నే సైతం డకౌట్ అయ్యాడు. దీంతో శ్రీలంక జట్టు రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 
 
ఈ క్రమంలో నాలుగో డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన చందీమాల్ (18) నింపాదిగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో నిమగ్నం కాగా, ఇషాంత్ శర్మ మరోమారు విజృంభించి వికెట్ తీశాడు. శర్మ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చిన చందీమాల్ పెవిలియన్‌కు చేరాడు. అప్పటికి 6.6 ఓవర్లలో శ్రీలంక స్కోరు మూడు వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో సిల్వా (14), మ్యాథ్యూ (2) క్రీజ్‌లో ఉన్నారు. 
 
అతకుముందు భారత జట్టు తన మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు 21/3తో నాలుగో రోజు ఉదయం ఆటను ప్రారంభించి, 274 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యంతో కలుపుకుని శ్రీలంక ముంగిట మొత్తం 386 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారత జట్టులో ఓపెనర్లు పుజారా 0, రాహుల్ 2, రహానే 4, కోహ్లీ 21, రోహిత్ శర్మ 50, బిన్నీ 49, ఓజా 35, అమిత్ మిశ్రా 39, అశ్విన్ 58, యాదవ్ 4, ఇషాంత్ శర్మ 2 చొప్పున పరుగులు చేయగా, 10 రన్స్ అదనపు పరుగుల రూపంలో వచ్చాయి. 
 
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన శ్రీలంకకు భారత పేసర్ ఇషాంత్ శర్మ చుక్కలు చూపిస్తున్నాడు. దాదాపు గంటకు 142 కిలోమీటర్ల సరాసరి వేగంతో దూసుకెళ్లేలా బంతులు విసురుతుండటంతో, వాటిని ఎదుర్కోవడానికి లంక ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నట్టు కనిపిస్తోంది. ఫలితంగా వెంటవెంటనే వికెట్లను కోల్పోతున్నారు.