గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (17:41 IST)

సారీ.. ఇకపై ఆ కుర్చీలో కూర్చోనంటే కూర్చోను : సుప్రీంకు శ్రీనివాసన్

సుప్రీంకోర్టుకు బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ భేషరతు క్షమాపణలు చెప్పారు. ఇకపై బీసీసీఐ కార్యనిర్వాహక సమావేశాల్లో పాల్గొనబోనని స్పష్టం చేశారు. ఇటీవల చెన్నైలో జరిగిన బీసీసీఐ సమావేశాలకు శ్రీనివాసన్ అధ్యక్షత వహించడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శ్రీనివాసన్ బేషరతు క్షమాపణలు తెలిపినట్టు ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ శుక్రవారం కోర్టుకు వివరించారు. 
 
అంతేకాకుండా, వచ్చేనెల 2న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించబోరని న్యాయమూర్తులు టీ.ఎస్. ఠాకూర్, ఇబ్రహీం కలిఫుల్లాలతో కూడిన ధర్మాసనానికి ఆయన తెలిపారు. దీంతో న్యాయస్థానం ఆయన క్షమాపణలను అంగీకరించింది. ఫిబ్రవరి 8వ తేదీన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడంపై శ్రీనివాసన్‌కు సుప్రీం కోర్టు నాలుగు రోజుల క్రితం అక్షింతలు వేసిన విషయం తెలిసిందే. 
 
శ్రీనివాసన్‌కు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం చురకలు అంటించింది. సుప్రీం తీర్పు స్ఫూర్తిని శ్రీనివాసన్ అర్థం చేసుకున్నట్లుగా లేదని వ్యాఖ్యానించింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవద్దని చెబితే సమావేశాలకు అధ్యక్షత ఎలా వహిస్తారని ప్రశ్నించింది.