మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2015 (16:00 IST)

భారత్-పాక్‌ల మధ్య సిరీస్ రద్దు చేయాల్సిన పరిస్థితులు లేవు: పీసీబీ

ఉధంపూర్ ఘటన, దావూద్ పాకిస్థాన్‌లోనే ఆశ్రయం పొందుతున్నాడనే విషయం తెలియరావడంతో భారత్-పాకిస్థాన్ సిరీస్ నిర్వహణపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. డిసెంబరులో దాయాదుల మధ్య క్రికెట్ సిరీస్ జరగాల్సి ఉంది. అయితే టెర్రరిజం, సరిహద్దు కాల్పులు, దావూద్ ఇబ్రహీంకు ఆశ్రయం వంటి ఇతరత్రా అంశాల కారణంగా పాకిస్థాన్ తీరును భారత్ తప్పుబట్టినప్పటికీ పాక్ ఏ తప్పూ చేయలేదని బుకాయిస్తుంది. 
 
ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సిరీస్ జరగడం అనుమానమేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనూ సిరీస్ జరుగుతుందని పీసీబీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. దీనిపై వచ్చే నెలలో స్పష్టత కూడా వస్తుందని పీసీబీ అధికారి నజామ్ సేథీ అంటున్నారు. 
 
భారత రాజకీయ నేతలు చేసే ప్రకటనలకు కానీ, మీడియాలో వచ్చే కథనాలను కానీ తీవ్రంగా పరిగణించాల్సిన పనిలేదని, భారత్-పాక్‌ల మధ్య ఇలాంటి గొడవలు సర్వసాధారణమని.. సిరీస్ రద్దు చేయాల్సి వచ్చేంత స్థాయిలో పరిస్థితులు లేవని సేథీ చెప్తున్నారు. 
 
సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగే ఐరాస సమావేశాల సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ భేటీ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో భారత్-పాక్‌ల మధ్య క్రికెట్ సిరీస్‌కు జరిగే అవకాశాలు లేకపోలేదని పీసీబీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.