శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (12:46 IST)

రూ.కోట్లు అర్జిస్తున్న క్రికెటర్‌కు కూడా సర్కారీ పెన్షన్ కావాలట... ఎవరా క్రికెటర్!

ప్రపంచంలోని ఇతర దేశాల క్రికెటర్ల కంటే అత్యధిక వార్షిక ఆదాయం అర్జిస్తున్నది ఒక్క భారత క్రికెటర్లు మాత్రమే. అందుకే... భారత క్రికెట్ జట్టులో ఒక్కసారైనా చోటుదక్కించుకోవాలని దేశానికి చెందిన ప్రతి వర్ధమాన క్రికెటర్ కలలు కంటాడు. అందుకోసం అహర్నిశలు కృషిచేస్తాడు. అతని కల ఫలించి.. టీమిడియాలో చోటుదక్కిందంటే.. అతని పంటపడినట్టే. దశ తిరిగినట్టే. సంవత్సరానికి కోట్లాది రూపాయలు గడించవచ్చు. అలాంటి భారత క్రికెటర్లు.. తాము సంపాదించే సొమ్ము సరిపోవడం లేదనీ తమకు కూడా ప్రభుత్వ పెన్షన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. సురేష్ రైనా. భారత క్రికెట్ జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడు. కెప్టెన్ ధోనీకి అత్యంత సన్నిహితుడు. 
 
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ద్వారా యశ్‌భారతి అవార్డులు పొందినవారికి నెలకు 50 వేల రూపాయలు పెన్షన్‌గా ఇస్తుంది. ఈ అవార్డులు పొందిన వీవీఐపీలు, సంపన్నులు కూడా ప్రభుత్వ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని ప్రతిపక్ష పార్టీలంటున్నాయి. క్రికెటర్ సురేశ్ రైనా, కాంగ్రెస్ సీనియర్ నేత, సినీ నటుడు రాజ్ బబ్బర్ ఆయన సతీమణి కూడా ప్రభుత్వ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. 
 
ఇప్పటివరకూ 141 మందికి యశ్ భారతి అవార్డులిచ్చారు. వీరిలో 100 మంది ప్రభుత్వ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన సతీమణి, తనయుడు అభిషేక్ బచ్చన్‌లు కూడా ఈ అవార్డులు పొందినవారిలో ఉన్నారు. దీంతో తమకు ఇవ్వాలనుకుంటోన్న పెన్షన్ మొత్తాన్ని పేద బాలికల చదువుకు వినియోగించాలని అమితాబ్ కుటుంబసభ్యులు సూచించి తమ పెద్ద మనసును చాటుకున్నారు. 
 
ప్రభుత్వ పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవడంపై రాజ్‌బబ్బర్‌ను అడగ్గా ఆయన స్పందించేందుకు నిరాకరించారు. అయితే సురేశ్ రైనా మాత్రం తీవ్రంగా స్పందించారు. నన్నెందుకు అడుగుతున్నారు. ఆ ప్రశ్నేదో ముఖ్యమంత్రి అఖిలేష్‌ను అడగండంటూ బదులిచ్చారు. నాకు పెన్షన్ ఎందుకిస్తున్నారో ముఖ్యమంత్రినే అడగండని రైనా చెప్పడం విస్మయం కలిగిస్తోంది.