బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (10:16 IST)

చండీమల్ నోరు జారాడు.. చేత్తో తలబాదుకుంటూ సెండాఫ్ ఇచ్చాడు..!

భారత పేసర్ ఇషాంత్ శర్మ శ్రీలంక ప్లేయర్లకు పుండు మీద కారం చల్లాడు. తనను ఇబ్బంది పెట్టేలా లంక దమ్మిక ప్రసాద్ వరుసగా బౌన్సర్లు విసురుతుంటే, వాటిని చిరునవ్వుతో తప్పించుకుంటూ మూడు బంతులాడిన ఇషాంత్ శర్మ.. ఓ సింగిల్ తీసి మరో బౌన్సర్ వేస్తావా? అంటూ తల చూపించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రసాద్, ఇషాంత్ దగ్గరికి వచ్చి ఏదో చెప్పడంతో, అంతే కోపంగా ఇషాంత్ సైతం సమాధానం చెప్పాడు. 
 
ఆ వెంటనే చండీమల్ వచ్చి నోరు జారడంతో అంపైర్లు కల్పించుకోవాల్సి వచ్చింది. ఆపై కూడా ప్రసాద్ బౌన్సర్ వేయడంతో అంపైర్లు దాన్ని 'నో బాల్' ప్రకటించారు. అప్పటికి కథ ముగిసినా, లంక రెండో ఇన్నింగ్స్‌లో చండీమల్ వికెట్ తీసిన ఆనందాన్ని ఇషాంత్ తనదైన శైలిలో ప్రదర్శించాడు. 
 
చండీమల్ అవుట్ కాగానే, చేత్తో తన తలను బాదుకుంటూ సెండాఫ్ ఇచ్చాడు. చండీమల్ సైతం కోపంగా చూస్తూ, ఏదో అనుకుంటూ పెవీలియన్ దారి పట్టాడు. ఈ విధంగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఇషాంత్ శర్మ శ్రీలంక బ్యాట్స్‌మెన్లకు, బౌలర్లకు బౌలింగ్ ప్లస్ వివాదాలతో చుక్కలు చూపించాడు.