బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 జులై 2015 (10:25 IST)

బెంగళూరు జట్టును అమ్మకానికి పెట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఇండియన్ లిక్కర్ కింగ్‌గా పేరున్న కింగ్ ఫిషర్ ఎయిర్‌ లైన్స్ అధినేత విజయ్ మాల్యా అమ్మకానికి పెట్టనున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఒక్కో సంస్థ నుంచి తప్పుకుంటూ వస్తున్న విజయ్ మాల్యాకు చెందిన జట్టును జిందాల్ గ్రూపునకు చెందిన జేఎస్ డబ్ల్యూ స్టీల్ కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. 
 
తాము ఒక ఐపీఎల్ టీమును కొంటున్నామని జేఎస్ డబ్ల్యూ స్టీల్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తెలిపారు. ఇండియాలో నంబర్ వన్ క్రీడగా ఉన్న క్రికెట్‌కు సంబంధించి ఒక ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. డబ్బులు తమకు సమస్య కాదని.. గుర్తింపు కోసమే జట్టును కొనుగోలు చేశామని చెప్పారు. 
 
కాగా, విజయ్ మాల్యా 2008లో ఐపీఎల్ పోటీలను ప్రకటించి, ఫ్రాంచైజీలను విక్రయానికి ఉంచినప్పుడు బెంగళూరు జట్టును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ 8 సార్లు ఐపీఎల్ పోటీలు జరుగగా, బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా చాంపియన్‌గా నిలవకపోవడం గమనార్హం.