గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 జులై 2015 (17:54 IST)

యంగ్ క్రికెటర్ల కోసం పీసీబీతో విభేదాలను పక్కనబెట్టిన వసీమ్ అక్రమ్!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో విభేదాలున్నప్పటికీ వాటిని పక్కనబెట్టాడు ఆ పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీమ్ అక్రమ్. శిక్షణ అనగానే పీసీబీతో విబేధాలను మరిచిపోయి.. ఆటగాళ్ల కెరీర్, భవితవ్యంపై దృష్టి పెట్టాడు. తాజాగా, కరాచీలో జరిగే ఓ పేస్ క్యాంపులో అక్రమ్ 12 ది మెరికల్లాంటి ఫాస్ట్ బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించాడు. 12 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనే యువ బౌలర్ల జాబితాను పీసీబీ గురువారం ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి జరిగే ఈ ట్రైనింగ్ క్యాంపుకు కరాచీలోని నేషనల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. 
 
కాగా, ఈ కుర్రాళ్లను దేశంలోని నాలుగు కేంద్రాల్లో నిర్వహించిన ట్రయల్స్ ద్వారా ఎంపిక చేశారు. అక్రమ్ ఇలాగే 2013లోనూ ఓ శిక్షణ శిబిరంలో కుర్రాళ్లకు సానబట్టాడు. జునైద్, ఇర్ఫాన్, సొహైల్, రియాజ్ వంటి పేసర్లు ఆ శిబిరంలో శిక్షణ పొందినవాళ్లే కావడం విశేషం. 
 
అయితే, ఇటీవల పీసీబీ నిర్ణయాలను అక్రమ్ ప్రశ్నిస్తుండడంతో వాతావరణం కాస్త వాడీవేడిగా మారింది. కానీ, అక్రమ్‌తోనే ఈ శిబిరంలో శిక్షణ ఇప్పించాలని ఓ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ పట్టుబట్టింది. అక్రమ్‌కు తామే నేరుగా పారితోషికం చెల్లిస్తామని, శిబిరాన్ని స్పాన్సర్ చేస్తామని సదరు సంస్థ స్పష్టం చేసింది. ఈ టాలెంట్ హంట్ పథకానికి అక్రమ్ నేతృత్వం వహిస్తేనే తాము స్పాన్సర్ చేస్తామని సదరు సంస్థ పీసీబీకి తేల్చి చెప్పింది. దాంతో, అక్రమ్‌తో శిబిరానికి పీసీబీ ఓకే చెప్పినట్టు సమాచారం.