శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 1 మార్చి 2015 (14:01 IST)

ఇంగ్లాండ్ చిత్తు.. తొమ్మిది వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం..!

ప్రపంచ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో శ్రీలంక జట్టు ఘన విజయం సాధించింది. వెల్లింగ్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యీటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 309 పరుగులు చేసింది. 
 
అనంతరం 310 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక బ్యామ్స్ మెన్ ఆది నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ గా బరిలోకి దిగిన లాహిరు తిరిమన్నే (139) చివరి దాకా కొనసాగి సెంచరీతో చెలరేగాడు. అతడితో కలిసి లంక ఇన్నింగ్స్ ను ప్రారంభించిన తిలకరత్నే దిల్షాన్ (44) జట్టు స్కోరు సెంచరీ మార్కు తాకగానే ఔటయ్యాడు. దిల్షాన్ నిష్క్రమణతో రంగంలోకి దిగిన లంక స్టార్ బ్యాట్స్ మన్ కుమార్ సంగక్కర 86 బంతుల్లోనే 117 పరుగులు రాబట్టాడు. 
 
దీంతో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయిన లంకేయులు ఇంగ్లండ్ పై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇంగ్లాండ్‌పై సాధించిన విజయంతో శ్రీలంక నాకౌట్ దశకు చేరువైంది. ఇంగ్లాండ్ ఓడిపోవడంతో నాకౌట్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో రూట్ (121) సెంచరీని నమోదు చేయగా, ఇయాన్ బెల్ (49) పరుగు తేడాతో అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. శ్రీలంక బౌలర్లలో మలింగ, మాథ్యూస్, దిల్షాన్, హెరాత్, పెరెరా, లక్మల్ తలో వికెట్ తీసుకున్నారు.