మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 24 మార్చి 2015 (10:40 IST)

సౌతాఫ్రికా చిత్తు.. ఫైనల్‌కు కివీస్.. విశ్వవిజేతగా భారత్.. వాట్సాప్‌లో సందేశాలు!

ఈనెల 29వ తేదీన జరుగనున్న క్రికెట్ వరల్డ్ కప్ 2015పై ఫైనల్ పోటీలపై వాట్సాప్‌లో అనేక రకాలైన సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా... వాట్సాప్ ఖాతాదారులు తదుపరి క్రికెట్ విశ్వవిజేతపై జోస్యం కూడా చెపుతున్నారు. ఈసారి వరల్డ్ కప్ విజేతగా భారత్ అవతరిస్తుందని వారు తమ సందేశాల్లో పోస్ట్ చేస్తున్నారు. 
 
అంతేకాదండోయ్, మంగళవారం జరుగుతున్న తొలి సెమీస్ ఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి కివీస్ జట్టు ఫైనల్‌కు చేరుతుందట! అలాగే, 26వ తేదీన ఆస్ట్రేలియాతో జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించి ఫైనల్‌కు చేరుతుందట. దీంతో ఫైనల్లో కివీస్‌ను ధోనీ సేన ఓడిస్తుందట. అది కూడా 20 పరుగుల తేడాతోనేనట. అదేంటీ, మ్యాచ్‌కు ఇంకా చాలా సమయం ఉంది కదా? అంటే, జరగబోయేదేంటో ముందే చెప్పేస్తున్నామంటోంది ఓ వాట్సాప్ మెసేజ్. 
 
నిజమేనండోయ్, సదరు వాట్సాప్ మెసేజ్ ఇదివరకు చెప్పిన విషయాలన్నీ నిజమయ్యాయి. అందుకే ప్రస్తుతం ఈ ‘వాట్సాప్ మేసేజ్ జోస్యం’పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రధానంగా అలహాబాదు నగరంలో ఎక్కడ చూసినా దీనిపై చర్చలే కనిపిస్తున్నాయి. ఈ మెసేజ్ నిజమైతే, అంతే చాలంటూ భారత క్రికెట్ అభిమానులు ఒకటికి రెండుసార్లు ఆ వాట్సాప్ మెసేజ్‌ను చూసేస్తున్నారు.