బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (13:22 IST)

క్రికెట్ కెరీర్‌లో వరల్డ్ కప్ నెగ్గని దిగ్గజాలు ఎవరో తెలుసా?

క్రికెట్ కెరీర్‌లో వరల్డ్ కప్ నెగ్గని దిగ్గజాలు చాలామందే ఉన్నారు. కెరీర్లో ఒక్కసారైనా వరల్డ్ కప్ నెగ్గాలని ప్రతి ఒక్క అంతర్జాతీయ క్రికెటర్ భావిస్తాడు. కానీ ఆ కల సాకారం కాకుండానే ఖాతాలో వరల్డ్ కప్ లేకుండానే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లకు దాని తాలుకు వెలితి బాధిస్తుంది.
 
ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, బ్రయాన్ లారా, అనిల్ కుంబ్లే, జాక్వెస్ కలిస్, సయీద్ అన్వర్, అలెన్ డొనాల్డ్, జాంటీ రోడ్స్, వకార్ యూనిస్, మార్టిన్ క్రో, ఇయాన్ బోథమ్, కర్ట్ లీ ఆంబ్రోస్ తదితరులు ఉన్నారు. ఎందుకంటే, వీళ్లందరూ తమ సుదీర్ఘ కెరీర్లో ఒక్కసారి కూడా వరల్డ్ కప్ విజయాన్ని రుచిచూడలేదు.
 
గంగూలీ నాయకత్వంలోని టీమిండియా 2003లో వరల్డ్ కప్ ఫైనల్ చేరినా ఆస్ట్రేలియా ధాటికి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ద్రావిడ్ వరల్డ్ కప్ చాన్సులు కూడా ఈ టోర్నీతోనే ఆవిరయ్యాయి. మహోన్నత బ్యాట్స్ మన్ లారా విషయానికొస్తే... 1996 టోర్నీలో సెమీస్ లోనే విండీస్ వెనుదిరగింది. దీంతో, అతని ఆకాంక్ష నెరవేరలేదు. 
 
ఇక, క్రికెట్ ప్రపంచంపై తనదైన ముద్ర వేసిన సఫారీ యోధుడు జాక్వెస్ కలిస్‌ది మరో కథ. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న జట్టుతో బరిలోదిగినా ఒత్తిడికి తట్టుకోలేని బలహీనతతో దక్షిణాఫ్రికా జట్టు 1999, 2007 వరల్డ్ కప్ టోర్నీల్లో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.