శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 ఆగస్టు 2014 (15:36 IST)

ట్రై సిరీస్: 198 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా శుభారంభం

ట్రై సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో సోమవారం ఏకపక్షంగా జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 198 పరుగుల తేడాతో జింబాబ్వేను మట్టికరిపించింది. 
 
గ్లెన్ మ్యాక్స్‌వెల్ (46 బంతుల్లో 93; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), మిషెల్ మార్ష్ (83 బంతుల్లో 89; 7 ఫోర్లు, 4 సిక్సర్లు)ల విధ్వంసకర బ్యాటింగ్‌తో ముందుగా ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీ స్కోరు సాధించింది. 
 
ఆరోన్ ఫించ్ (79 బంతుల్లో 67; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, బ్రాడ్ హాడిన్ (58 బంతుల్లో 46; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మ్యాక్స్‌వెల్, మార్ష్ నాలుగో వికెట్‌కు 9 ఓవర్లలోనే 109 పరుగులు జోడించడం విశేషం.
 
అనంతరం జింబాబ్వే 39.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. హామిల్టన్ మసకద్జా (91 బంతుల్లో 70; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్మిత్ 3 వికెట్లు పడగొట్టగా... స్టార్క్, లియోన్ చెరో 2 వికెట్లు తీశారు. మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు ఒక వికెట్ కూడా తీసిన మార్ష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.