శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 ఆగస్టు 2014 (16:59 IST)

ధోనీకి బీసీసీఐ షాక్ : బీ కేర్ ఫుల్ అంటోన్న అభిమానులు!

ఇంగ్లండ్ గడ్డపై గెలవలేదని ధోనీని బీసీసీఐ ప్రశ్నిస్తుందా?.. టీమిండియాను టెస్టుల్లో అగ్రస్థానం నిలిపి, ప్రపంచ కప్ సాధించిపెట్టిన ధోనీకి బీసీసీఐ షాక్ ఇవ్వడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇన్నాళ్లు జట్టును సమర్థవంతంగా నడుపుతున్న కూల్ కెప్టెన్‌.. కోచ్‌పై చిన్నపాటి ప్రకటన చేయగానే బీసీసీఐ హంగామా చేయడం ఏమాత్రం బాగోలేదని, ఈ విషయంలో బీసీసీఐ ధోనీ కంటే ముందుగానే ప్రకటన చేసి వుండాలని అభిమానులు అంటున్నారు. 
 
ఆటగాళ్లలో కోచ్‌ని తీసేస్తున్నారనే విషయం ప్రచారంలోకి రాగానే జట్టు ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం చూపకూడదనే అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ధోనీ ఇలాంటి ప్రకటన చేసివుండవచ్చునని అభిమానులు అంటున్నారు. ఈ విషయంలోనూ ధోనీ తన కెప్టెన్సీ రూల్‌నే ఫాలో చేశాడని వారు వివరణ ఇచ్చుకుంటున్నారు. 
 
అయితే క్రీడా విశ్లేషకులు ఏమంటున్నారంటే.. హెడ్ కోచ్ డంకెన్ ఫ్లెచర్ విషయంలో ధోనీ చేసిన వ్యాఖ్యను బిసిసిఐ కొట్టిపారేసింది. కాగా ధోనీకి ఉన్న అధికారం ఏమిటి... జట్టు కోచ్‌గా ఎవరిని ఉంచాలి? ఎవరిని తొలగించాలి? అన్న కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అధికారం భారత జట్టు కెప్టెన్‌గా ధోనీకి ఉందా? నిబంధనల ప్రకారమైతే లేదు.
 
బీసీసీఐ పాలక మండలి, జాతీయ సెలక్షన్ కమిటీ ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటుంది. అలాలేనప్పుడు ఫ్లెచర్ పదవీ కాలంపై ప్రకటన చేయడం వెనుక ధోనీకి ఏదైనా స్పష్టమైన వ్యూహం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 
 
సిరీస్ మధ్యలో కోచ్‌ని తొలగిస్తారన్న వార్త ప్రచారమైతే, దాని ప్రభావం ఆటగాళ్లపై ఉంటుందని ధోనీ భావిస్తే ఆ విషయాన్ని ముందుగా బిసిసిఐ దృష్టికి తీసుకెళ్లాలి. వారి నుంచి ప్రకటనలు ఇప్పించాలి. కానీ, తనంతట తానుగా అతను ఎందుకు స్పందించాడన్నది ప్రశ్న. ఫ్లెచర్‌ను కొనసాగిస్తున్నట్టుగానీ, తొలగిస్తున్నట్టుగానీ బిసిసిఐ ఎక్కడా చెప్పలేదు.
 
జట్టు వ్యవహారాలను చూసే సంధాన కర్తగా బాధ్యతలను డైరెక్టర్ హోదాలో మాజీ కెప్టెన్ రవి శాస్త్రికి అప్పగించింది. అతను కూడా ఫ్లెచర్ స్థాయిని తగ్గించడం లేదని స్పష్టం చేశాడు. బిసీసీఐకి గానీ, రవి శాస్త్రీకిగానీ లేని తొందర ధోనీకి ఎందుకనేది ప్రశ్న.
 
రవి శాస్త్రీని డైరెక్టర్‌గా నియమించే విషయంలో ధోనీ అభిప్రాయాలను బిసిసిఐ పరిగణలోకి తీసుకోలేదని అంటున్నారు .అదే నిజమైతే, తన ఆధిపత్యం దెబ్బ తింటుందనే భయం ధోనీని వెంటాడుతుండవచ్చు. ఆ క్రమంలోనే అతను ఫ్లెచర్ కొనసాగింపుపై ప్రకటన చేసి ఉండవచ్చు. నిజానిజాలు ఎలావున్నా, ధోనీతో బిసిసిఐ మధ్య సంబంధాలు మునుపటి మాదిరి బలంగా లేవన్నది వాస్తవం. 
 
ధోనీ కెప్టెన్సీపై వినిపిస్తున్న డిమాండ్లు కూడా బోర్డు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. రాబోయే ప్రమాదాన్ని గుర్తించి ధోనీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడని కొందరి వాదన. ఏమైనా, ధోనీ నాయకత్వానికి, నాయకత్వాన్ని ఆసరా చేసుకుని చెలాయిస్తున్న ఆధిపత్యానికి తెర పడినట్లేనని భావిస్తున్నారు. కానీ ధోనీ మాత్రం దేనికైనా రెడీగానే ఉన్నట్లు తెలుస్తోంది. జట్టును దృష్టిలో పెట్టుకునే ఈ ప్రకటన చేసినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. 
 
జట్టును గట్టెక్కించినప్పుడల్లా పొగిడిన బీసీసీఐ.. ఒక్కసారి జట్టు ఓడిపోవడంతో కెప్టెన్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని క్రీడా పండితులు అంటున్నారు. గెలుపోటములు ఆటలో సహజమని వారు అంటున్నారు.
 
అయితే ఆటగాళ్లను ప్రోత్సహించడం.. మెలకువలను నేర్పించే విషయమై బీసీసీఐ చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. ఫ్లెచర్‌పై ఊహాగానాలపై ముందుగానే స్పందించిన ధోనీని ఏకిపారేయడం ఏమాత్రం సరికాదని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. సో.. బీసీసీఐ ధోనీ అచీవ్‌మెంట్స్‌ను ఓసారి గుర్తుపెట్టుకుని మాట్లాడే బాగుంటుందని క్రీడా విశ్లేషకులే కాదు.. అభిమానులు కూడా వాదిస్తున్నారట.