శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (11:33 IST)

ధోనీకి కోపం వచ్చింది? బిర్యానీ కోసం హోటల్ నుంచి అవుట్!

ధోనికి కోపం వచ్చింది ? కారణం ఏంటీ ? అనుకుంటున్నారా ? కేవలం బిర్యానిపై ఆయనకు కోపం వచ్చింది. బిర్యానిపై కోపమా ? అని ఆశ్చర్యపోతున్నారా ? అవునండి ఇది నిజం. టీ ట్వంటీ ఛాంపియన్స్ లీగ్‌లో వ్యూహం దెబ్బతినటంతో ప్రత్యర్థి జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో నైరాశ్యంలో కూరుకుపోయిన కెప్టెన్‌ ధోని సహా జట్టు సభ్యులంతా హైదరాబాద్‌ గ్రాండ్‌ కాకతీయ హోటల్లో విశ్రాంతి తీసుకున్నారు.
 
''మీ కోసం ప్రత్యేకంగా ఇంట్లో హైద్రాబాద్‌ బిర్యానీ వండించాను.. మీరున్న హోటల్‌కే పంపిస్తున్నాను''..అంటూ హైదరాబాద్‌ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు ధోనికి కబురు పంపాడు. వయస్సులో చిన్నవాడైనప్పటికీ ఆత్మీయంగా, అది కూడా హైద్రాబాద్‌ బిర్యానీ పంపిస్తున్నాడనే సరికి టీం సభ్యులంతా ఆశగా ఎదురు చూసారు.
 
రాయుడు పంపిన హైద్రాబాద్‌ బిర్యానీ సమయం గడుస్తున్నా కానీ ఎంతకూ రాలేదు. దీంతో విషయం తెలుసుకుని బయటి పదార్ధాలను అనుమతించేది లేదంటూ గ్రాండ్ కాకతీయ యాజమాన్యం బిర్యానీని లోనికి పంపలేదు. చివరికి ధోనినే దిగి వచ్చి అడిగినా నిబంధనలు ఒప్పుకోవంటూ హోటల్‌ సిబ్బంది ఖరాకండిగా చెప్పారు. దీంతో జార్ఖండ్‌ డైనమైట్‌కు చిర్రెత్తుకొచ్చింది. 
 
నా మిత్రుడు పంపిన బిర్యానీనే అనుమతించరా అంటూ మండిపడ్డాడు. హుటాహుటిన తన సహచరులతో సహా గ్రాండ్ కాకతీయ హోటల్‌లోని 180 రూములను ఖాళీ చేయించి తాజ్‌ కృష్ణాకు మకాం మార్చాడు.
 
ధోని వీరావేశాన్ని చూసిన జట్టు మేనేజర్లు కానీ ఇటు హోటల్‌ సిబ్బంది గానీ నోరు మెదపలేకపోయారు. కాస్త పరిస్థితులు అనుకూలించాక మేం నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని గ్రాండ్ కాకతీయ యాజమాన్యం వివరణ ఇచ్చుకుంటే జట్టు సభ్యులు మాత్రం కెప్టెన్‌ చేసిందే కరెక్ట్ అన్నారు.