గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 13 ఆగస్టు 2014 (13:32 IST)

ఓవల్ టెస్టులో భారత్ క్రికెటర్లు త్తా చాటేనా.. చతికిల పడేనా?

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆశించిన మేరకు రాణించలేక పోయింది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టుల్లో ఒక్క లార్డ్స్ మైదానంలో మాత్రమే ధోనీ సేన తమ స్థాయికి తగ్గట్టుగా రాణించింది. తొలి డ్రా కాగా, లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో 95 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
అనంతరం జరిగిన రెండు వరుస టెస్టుల్లో ఓటమి పాలైన భారత్.. ఆధిక్యాన్ని ఇంగ్లండ్ చేతుల్లో పెట్టింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 266 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో చిత్తయింది. 445 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 178 పరుగులకే ఆలౌటై ఇంగ్లండ్‌ను సిరీస్‌ను సమం చేయడానికి అవకాశం ఇచ్చింది. అదేదో యాధృచ్చింగా జరిగిపోయిందని భావించిన సగటు భారత్ అభిమానికి  మాత్రం నాలుగో టెస్టు కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఏకంగా ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయి తీవ్ర విమర్శల పాలైంది.
  
ఇంకా భారత్‌కు చివరి టెస్టు రూపంలో ఆశలు మిగిలే ఉన్నాయి. ఆగస్టు 15 వ తేదీన ఓవల్‌లో జరుగనున్న ఐదో టెస్టుకు భారత్ సన్నద్ధం అవుతోంది. ఆ టెస్ట్ మ్యాచ్‌‌ను గెలిచి సిరీస్‌ను సమం చేయడానికి భారత్ తీవ్రంగా పోరాడాల్సి ఉంది. అదేసమయంలో ఇంగ్లండ్ కూడా మంచి ఊపు మీద కనబడుతోంది. కనీసం భారత్‌తో మ్యాచ్ గెలవకపోయినా.. సిరీస్‌ను ఇంగ్లండ్ వశం కానుంది. 
 
అసలు అంతకుముందు జరిగిన రెండు టెస్టుల్లో భారత్ విఫలమైన తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఆ రెండు టెస్టుల్లో కనీసం పోరాడకుండానే భారత క్రికెటర్లు చేతులెత్తేశారు. విదేశాల్లో గత భారత జట్టు చరిత్రను చూస్తే మాత్రం మనకు ఎక్కువ గుర్తుకు వచ్చే వ్యక్తులు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లు. వీరు విఫలమైయ్యారంటే మాత్రం భారత జట్టు ఓటమి పాలైన సందర్భాలే మెండు. వీరు సమష్టిగా విఫలమైన చోట భారత జట్టు ఫలితం కూడా ప్రతికూలంగా వచ్చిందని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు టీం ఇండియా పరిస్థితి కూడా ఇలానే ఉంది.
  
2011లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లి, చటేశ్వర పూజారాలు లేరు. తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తొలిసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లారు. దాంతో వీరిపై అంచనాలు పెరిగాయి. ఈ ఇద్దరు యువ ఆటగాళ్ల ప్రదర్శనపైనే భారత్ విజయావకాశాలు ఉన్నాయని క్రికెట్ నిపుణులు కూడా విశ్లేషించారు. ఇప్పుడు అదే సరిగ్గా ప్రతికూలంగా జరిగింది. 
 
వీరిద్దరి వైఫల్యంతో భారత జట్టు వరుస రెండు టెస్టుల్లో ఘోర పరాభావాన్ని మూట గట్టుకుంది. సాధారణంగా టెస్టుల్లో మూడు, నాలుగు స్థానాల్లో ఆడిన ఆటగాళ్లు విఫలమైతే మాత్రం అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల్లో ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు తమ సత్తా చాటుతారో లేక షరా మామూలుగానే చతికిల పడతారో వేసి చూడాల్సిందే.