గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 16 ఆగస్టు 2014 (11:37 IST)

భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్టు: ఇంగ్లండ్ అదుర్స్.. ఇండియా బ్యాటింగ్?

భారత్-ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. కుక్ 24, రాబ్సన్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. 
 
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ కేవలం 148 పరుగులకే ఆలౌటయ్యింది. కెప్టెన్ ధోని 82 మినహా... మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. 
 
ఎనిమిది మంది ఆటగాళ్లు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్, వోక్స్ చెరి మూడు వికెట్లు తీయగా... అండర్సన్, బ్రాడ్ తలా రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు.
 
కాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కు ఏమయ్యిందో ఎవరికీ అర్థం కావటం లేదు. ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క మురళీ విజయ్ ను మినహాయిస్తే... మిగతా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ స్కోరు 0,4,6,0. 
 
కనీసం పదో నెంబర్‌లో దిగే ఇషాంత్ శర్మలా కూడా భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ఆడలేకపోతున్నారు. పెద్దగా బ్యాటింగ్ రాని ఇషాంత్ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో 42 బంతుల్ని కాచుకుని నాటౌట్‌గా నిలిచాడు. ధోనికి 16 ఓవర్లకు పైగా సహకారమందించాడు. ఇషాంత్ శర్మలా కనీసం ఒకరిద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ పట్టుదల ప్రదర్శించినా భారత్ 148 పరుగులకే ఆలౌట్ అయ్యేది కాదు. 
 
ఓ పక్క ధోని బ్యాటింగ్ చూస్తుంటే... పిచ్ అంత ప్రమాదకంగా లేదని... ఇంగ్లండ్ బౌలర్లు మరీ అంత భీకరంగా బౌలింగ్ వేయడం లేదని అర్థమవుతోంది. కానీ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కు మాత్రం ఈ విషయం అస్సలు అర్థం కావడం లేదు. వాళ్లు ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొన్న తీరు గమనిస్తే... బంతి బంతికీ గండమే అన్నట్లు కనిపించింది. 
 
ఏ ఒక్కరూ కూడా ఆత్మవిశ్వాసంతో... సరైన టెక్నిక్‌తో బంతులను ఎదుర్కోలేదు. కనీసం ఇషాంత్ శర్మకు ఉన్న డిఫెన్స్ టెక్నిక్ కూడా భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమని క్రీడా పండితులు అంటున్నారు.