గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 30 జులై 2014 (09:03 IST)

ఇంగ్లండ్ బౌలర్ల విజృంభణ : ఫాలోఆన్ ముంగిట భారత్

ఇంగ్లండ్‌తో సౌతాంఫ్టన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఫాలోఆన్ ముంగిట ఉంది. ఈ గండం నుంచి తప్పించుకోవాలంటే ఇంకో 47 పరుగులు చేయాల్సి వుంది. అయితే చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. కెప్టెన్ ధోనీ (50 నాటౌట్), బౌలర్ షమీ (4 బ్యాటింగ్)లు క్రీజ్‌లో ఉన్నారు. 
 
ఈ టెస్టు మ్యాచ్‌‌లో ఇంగ్లండ్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 569 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్‌ను భారత్ తడబడుతూనే ప్రారంభించింది. ప్రతి బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్‌ను బాగానే ఆరంభించినప్పటికీ... ఆ ఆరంభాన్ని ఎవరూ సద్వినియోగం చేసుకోలేకపోయారు. రహానే (54; 113 బంతుల్లో 5 ఫోర్లు), ధోనీ (50 బ్యాటింగ్; 103 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. మూడోరోజు మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ 8 వికెట్లు కోల్పోయి 323 పరుగులు సాధించింది. 
 
ధోనీకి జతగా షమీ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. విజయ్ (35; 5 ఫోర్లు), కోహ్లీ (39; 3 ఫోర్లు), జడేజా (31; 6 ఫోర్లు), రోహిత్ (28; 3 ఫోర్లు), పుజార (24; 3 ఫోర్లు)... ఇలా భారత్ టాప్‌ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తమ ఆరంభాల్ని భారీ స్కోర్లుగా మలుచుకోవడంలో విఫలమయ్యారు. దీంతో భారత్ కష్టాలు తప్పలేదు. మరోవైపు.. ఇంగ్లండ్ పేసర్లు అండర్సన్ (3/52), బ్రాడ్ (3/65)లు వికెట్ల వేటలో పోటీపడ్డారు. పార్ట్ టైమ్ బౌలర్ మెయిన్ అలీకి కూడా భారత్ రెండు కీలక వికెట్లు సమర్పించుకుని, ఫాలోఆన్ ప్రమాదపుటంచున ధోనీ గ్యాంగ్ ఉంది.