గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (12:14 IST)

ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌ను తొలగించండి : సుప్రీంకోర్టు

ఐపీఎల్ ఫ్రాంచైజీల జాబితా నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును తొలగించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు సుప్రీంకోర్టు గురువారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో ఎలాంటి విచారణ అవసరం లేదని, తక్షణం ఆ జట్టును తొలగించాలని సూచించింది. ఐపీఎల్‌లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై విచారిస్తున్న సుప్రీంకోర్టు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహార వివాదమంతా చెన్నై ఫ్రాంచైజీ చుట్టూ తిరుగుతోందని అభిప్రాయపడిన కోర్టు.. అసలు ఆ జట్టును తప్పించాలని ఐపీఎల్ నిర్వాహకులకు సూచించింది. 
 
ఈ కేసు విచారణ సందర్భంగా ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ముఖ్యంగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఆధిపత్యం ఎవరిది? రూ.400 కోట్లతో సీఎస్‌కే జట్టును ఎందుకు కొనుగోలు చేశారు? ఇండియా సిమెంట్స్‌ కంపెనీలో పెట్టుబడులు ఎవరి? చెన్నై సూపర్ కింగ్స్‌కు శ్రీనివాసన్‌కు ఉన్న లింకేమిటి తదిత ప్రశ్నలను కోర్టు సంధించింది. తాము అడిగే ప్రశ్నలన్నింటికీ లిఖిత పూర్వకంగా సమాధానమివ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.