శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 21 జులై 2014 (19:32 IST)

లార్డ్స్ టెస్టులో భారత్ చారిత్రాత్మక విజయం : ఇంగ్లండ్ చిత్తు!

లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌‍లో భారత్ చారత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. 319 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య ఇంగ్లీష్ ఆటగాళ్లు 223 పరుగులకే ఆలౌట్ అయ్యారు. భారత బౌలర్ ఇషాంత్ శర్మ బంతితో నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు పెలివియన్‌కు వరుసగా క్యూకట్టారు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ ఏకంగా ఏడు వికెట్లు తీసి జట్టును ఒంటి చేత్తో గెలిపించారు. 
 
ఈ విజయం విదేశీ గడ్డపై గత మూడేళ్ళ కాలంలో భారత్‌‍కు లభించిన తొలి విజయం కాగా, లార్డ్స్ మైదానంలో 1986లో కపిల్ దేవ్ సేన సాధించిన విజయం తర్వాతి విజయం ఇదే కావడం గమనార్హం. దీంతో ధోనీ నేతృత్వంలోని భారత సేన లార్డ్స్ మైదానంలో తన పాత రికార్డును తిరగరాసినట్టయింది. 
 
ఇదిలావుండగా క్రికెట్ మక్కాగా పేరుగాంచిన లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత క్రికెట్ జట్టు విజయానికి ఆరు వికెట్ల దూరంలో నిలిచిన విషయం తెల్సిందే. 319 పరుగుల లక్ష్యఛేదనలో నాలుగో రోజు ఆట చివరికి ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ఐదో రోజు ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు బ్యాట్స్‌మెన్లు నింపాదిగా ఆడటం మొదలుపెట్టారు. 
 
ఈ క్రమంలో రూట్ 66, అలీ 39, ప్రియర్ 12 చొప్పున పరుగులు చేసి భారత విజయాన్ని ఆలస్యం చేశారు. ఈ క్రమంలో భారత బౌలర్ ఇషాంత్ శర్మ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించాడు. ఫలితంగా రూట్, అలీ, ప్రియర్, బ్రాడ్ (8)వికెట్లను వరుసగా నేలకూల్చాడు. అప్పటికి ఇంగ్లండ్ స్కోరు 216/9. చివరి వికెట్‌గా ఆండర్సన్ ఔట్ అయ్యాడు. 
 
జడేజా బౌలింగ్‌లో బంతిని ఫ్లిక్ చేసి ముందుకు వెళ్లిన ఆండర్సన్.. అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రనౌట్ రూపంలో ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 223 పరుగుల వద్ద ముగిసింది. ఫలితంగా భారత్ 95 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 295 పరుగులు, ఇంగ్లండ్ 319 పరుగులు చేయగా, భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో టెయిల్ ఎండ్ బౌలర్లు జడేజా, భువనేశ్వర్‌లు అర్థ సెంచరీల పుణ్యమాని 342 పరుగులు చేసింది. ఫలితంగా ఇంగ్లండ్ ముంగిట భారత్ 319 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఈ మైదానంలో ఇప్పటివరకు అత్యధిక పరుగుల ఛేదన రికార్డు విండీస్ పేరిట ఉంది. 1984లో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 344 పరుగులు చేసి ఇంగ్లండ్ జట్టును చిత్తుచేసింది. 
 
ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలి టెస్ట్ హీరో మురళీ విజయ్ సెంచరీ దగ్గరికి వచ్చేసినా, 5 పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు. రెండో టెస్ట్, రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా ఒంటరి పోరు కొనసాగించిన విజయ్, 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆండర్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలిటెస్ట్‌లో ఓ సెంచరీ, అర్థ సెంచరీలను నమోదు చేసిన విజయ్, రెండో టెస్ట్‌లో సెంచరీ చేరువలో వెనుదిరిగాడు.