గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 జులై 2014 (13:21 IST)

కలిస్ రిటైర్మెంట్: ఇక గుడ్ బై.. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్‌ల్లో ఆడుతా!

సచిన్, రికీ పాంటింగ్ తర్వాత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన దక్షిణాఫ్రికా లెజెండ్ క్రికెటర్ జాక్వెస్ కలిస్ అతంర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనున్నాడు. శ్రీలంక పర్యటనలో పేలవ ప్రదర్శన నేపథ్యంలో 38 ఏళ్ల కలిస్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను 2-1తో నెగ్గినా.. కలిస్‌ మాత్రం మూడు మ్యాచ్‌ల్లో కేవలం 5 పరుగులే (0, 1, 4) చేసి నిరాశపర్చాడు. 
 
అందుకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయిన కలిస్, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌), ఆస్ట్రేలియా బిగ్‌బాష్‌ లీగ్‌ల్లో కొనసాగుతానని కలిస్‌ చెప్పాడు. కలిస్‌ ఐపీఎల్‌లో కోల్‌కాతా నైట్‌రైడర్స్‌కు, బిగ్‌బాష్‌లో సిడ్నీ థండర్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సచిన్‌ తర్వాత కలిసే గొప్ప బ్యాట్స్‌మన్‌ అని ఇటీవల ద్రావిడ్‌ ప్రశంసించిన సంగతి తెలిసిందే. 
 
1995-96 ఇంగ్లండ్‌ పర్యటనలో కలిస్‌ టెస్ట్‌, వన్డే అరంగేట్రం చేశాడు. ‘2015 వన్డే ప్రపంచ కప్‌లో ఆడాలన్న కలకు చాలా దూరంలో ఉన్నానని తెలుసుకున్నాను. ప్రస్తుత దక్షిణాఫ్రికా జట్టు వచ్చే ఏడాది ప్రపంచ కప్‌ నెగ్గుతుందని ఆశిస్తున్నా. అలాగే టీమ్‌తో పాటు స్పాన్సర్స్, అభిమానులకు కలిస్ థ్యాంక్స్ చెప్పాడు.
 
కలిస్ గణాంకాలు.. 
టెస్టుల్లో... కలిస్‌ 166 టెస్ట్‌ల్లో 55.37 సగటుతో 13,289 పరుగులు చేశాడు. అందులో 45 సెంచరీలున్నాయి. 292 వికెట్లు తీయడంతో పాటు 200 క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. ఐదు వికెట్ల ప్రదర్శను ఐదు సార్లు చేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగుల జాబితాలో సచిన్‌ (15,921), పాంటింగ్‌ (13,378) తర్వాత కలిస్‌ మూడోస్థానంలో ఉన్నాడు.
 
వన్డేల్లో... 328 వన్డేల్లో 44.36 సగటుతో 17 శతకాలు.. 86 అర్ధ సెంచరీలతో 11, 579 పరుగులు చేశాడు. 273 వికెట్లు కూల్చాడు. 1996 నుంచి ఐదు వన్డే ప్రపంచ కప్‌లలో పాల్గొన్నాడు.