గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. »
  3. క్రికెట్
  4. »
  5. వార్తలు
Written By Ganesh
Last Updated : శనివారం, 31 మే 2014 (09:55 IST)

ఫైనల్లో పంజాబ్.. సెహ్వాగ్ సూపర్ సెంచరీ.. రైనా విధ్వంసం వృథా!

ఐపీఎల్-7లో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ రసవత్తరంగా సాగించి. నువ్వానేనా అన్నట్లు కింగ్స్‌ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ కొదమ సింహాల్లా తలపడ్డ పోరులో చివరకు కింగ్స్ ఎలెవన్ ముందు సూపర్ కింగ్స్ తలవంచింది. తొలుత వీరేంద్ర సెహ్వాగ్ 50 బంతుల్లో సెంచరీ కొట్టి తుఫాన్ సృష్టిస్తే ఆ తర్వాత రైనా 16 బంతుల్లో 50 పరుగులు సాధించి సునామీ సృష్టించాడు.

లీగ్ దశలో ఎదురులేకుండా వరుస విజయాలతో ప్లే ఆఫ్‌కు చెరుకున్న పంజాబ్ తొలి క్వాలిఫయర్‌లో కోల్‌కతా చేతిలో ఓటమి చవిచూసింది. ఫైనల్‌కు చేరాలంటే చెన్నైతో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మరో సారి జూలు విదిల్చింది. అద్భుత ప్రదర్శనతో తొలి సారి ఐపీఎల్ ఫైనల్లోకి ప్రవేశించింది.

శుక్రవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ 24 పరుగుల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ (58 బంతుల్లో 122; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సూపర్ సెంచరీ సాధించగా, మిల్లర్ (19 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్), మనన్ వోహ్రా (31 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్సర్లు) అండగా నిలిచాడు.

ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. సురేశ్ రైనా (25 బంతుల్లో 87; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుత ప్రదర్శన వృథా అయింది. ఆనందం పంజాబ్‌కు ఎంతో సేపు నిలవలేదు. సురేశ్ రైనా అత్యద్భుతమైన ఆటతో చెన్నై ఇన్నింగ్స్‌ను ఆకాశంలో నిలబెట్టాడు. మరో వైపు స్మిత్ (7) విఫలమయ్యాడు. రైనా రనౌట్ అయ్యాక... జడేజా (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) , ధోని కొద్దిసేపు పోరాడినా ఫలితం లేకపోయింది. సెహ్వాగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.