బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 23 ఆగస్టు 2014 (12:20 IST)

వామప్ మ్యాచ్‌లో గెలిచారోచ్ : మెరిసిన కోహ్లీ, రాయుడు

ప్రతిష్టాత్మకమైన వన్డే సిరీస్‌కు ముందు మిడిల్‌సెక్స్‌తో శుక్రవారం జరిగిన పరిమిత ఓవర్ల వామప్ మ్యాచ్‌లో టీమిండియా 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (71), అంబటి రాయుడు (72) అర్ధ శతకాలు నమోదు చేసి ఆదుకున్నారు. 
 
అయితే మిగతా బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. దీంతో భారత్ 50 ఓవర్ల కోటాను కూడా పూర్తిగా ఆడలేక, 44.2 ఓవర్లలో 230 పరుగులకే ఆలౌటైంది. అయితే, బౌలర్లు రాణించడంతో టీమిండియా విజయం సాధ్యమైంది. 
 
టాస్ గెలిచిన మిడిల్‌సెక్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 44.2 ఓవర్లలో 230 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (8), శిఖర్ ధావన్ (10) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు.
 
అజింక్య రహానే కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక 14 పరుగులకు ఔటయ్యాడు. 52 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో జట్టును ఆదుకునే బాధ్యతను కోహ్లీ, రాయుడు తీసుకున్నారు. 
 
నాలుగో వికెట్‌కు వీరు 104 పరుగులు జోడించారు. 75 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 71 పరుగులు చేసిన కోహ్లీ..రవి పటేల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జాన్ సింప్సన్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. 
 
రవీంద్ర జడేజా 7 పరుగులకే ఔట్‌కాగా, అశ్విన్ (18)తో కలిసి జట్టు స్కోరును 200 పరుగుల మైలు రాయిని దాటించిన రాయుడు రిటైర్డ్ ఔటయ్యాడు. అతను 82 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లతో 72 పరుగులు చేశాడు.
 
టెయిలెండర్లు విఫలమవడంతో భారత్ ఇన్నింగ్స్‌కు 230 పరుగుల వద్ద తెరపడింది. 39.5 ఓవర్లలో 135 పరుగులు చేసి ఆలౌటైన మిడిల్‌సెక్స్ 95 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.