మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (20:24 IST)

మురళీ విజయ్ అదుర్స్.. టెస్టు క్రికెట్లో ఐదో సెంచరీ!

టీమిండియా ఓపెనర్‌ మురళీ విజయ్, కంగారూల గడ్డపై సత్తాచాటాడు. తన టెస్టు కెరీర్‌లో ఐదో సెంచరీని నమోదు చేసుకున్నాడు. టెస్ట్ స్పెషలిస్ట్‌గా పేరున్న విజయ్, స్టైలిష్‌ బ్యాటింగ్‌తో భారత జట్టులో తనదైన ముద్ర వేస్తున్నాడు. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ వరుసగా విఫలమవుతున్నా, విజయ్ మాత్రం భారత జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.
 
ఇప్పటివరకూ టెస్ట్ కెరీర్‌లో అంతంత మాత్రంగానే రాణించిన విజయ్‌, ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా సిరీస్‌లో మాత్రం అదరగొడుతున్నాడు. అడిలైడ్‌ వేదికగా ముగిసిన తొలి టెస్ట్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ హాఫ్‌ సెంచరీలతో సత్తా చాటిన విజయ్, బ్రిస్బేన్‌ టెస్ట్‌లో సూపర్‌ సెంచరీతో చెలరేగాడు.
 
స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కొహ్లీ, చటేశ్వర్‌ పుజారా తక్కువ పరుగులకే ఔటైనా మరో ఎండ్‌లో క్రీజ్‌లో పాతుకుపోయాడు.  కవర్స్ మీదుగా పర్‌ఫెక్ట్ టైమింగ్‌తో ఫోర్‌ కొట్టి, 175 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇప్పటివరకూ 29 టెస్టులాడిన మురళీ విజయ్‌కు ఇది కెరీర్‌లో 5వ సెంచరీ కావడం విశేషం.
 
సెంచరీ చేసిన తర్వాత కూడా తడబడలేదు. రహానేతో కలిసి నాలుగో వికెట్‌కు 165 బంతుల్లో 124 పరుగులు జోడించి జట్టు భారీ స్కోర్‌కు పునాది వేశాడు. అయితే 213 బంతుల్లో 22 ఫోర్లతో 144 పరుగులు చేసిన విజయ్‌, నాథన్‌ లియోన్‌ బౌలింగ్‌లో హాడిన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.