మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (10:49 IST)

ఫిల్ హ్యూస్‌ది అరుదైన మెడికల్ కేసు : సెయింట్ విన్సెంట్ ఆస్పత్రి!

బౌన్సర్ బంతి తగిలి మృత్యువాత పడిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిల్ హ్యూస్‌ది అరుదైన కేసుగా సెయింట్ విన్సెంట్ ఆస్పత్రి వైద్యులు పేర్కొంటున్నారు. అతనికి అరుదైన ప్రదేశంలో బంతి తగిలిందని, దాని మూలంగా అతను కోలుకునేందుకు సమయం పడుతుందని తెలిపారు. మెడకు పక్కన ఉండే వెర్టెబ్రల్ ఆర్టెరీకి బంతి తగిలింది. దీంతో అది తీవ్రమైన ఒత్తిడికి గురై, నలిగిపోయిందని వివరించారు. 
 
ఈనెల 25వ తేదీన సిడ్నీ క్రికెట్ మైదానంలో దేశవాళీ జట్టుతో ఆడుతున్న సందర్భంగా షాట్ల ఎంపికలో జరిగిన తప్పిదంతో హ్యూస్ దవడకు కింది భాగాన్ని బంతి బలంగా తాకడంతో అక్కడే కుప్పకూలి పోయిన విషయం తెల్సిందే. ఈ దెబ్బకు షాక్‌ తిన్న హ్యూస్ తేరుకునే లోపే కిందిపడి కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో వైద్యులు అన్ని పరీక్షలు చేసి అతనికి అరుదైన కేసుగా ప్రకటించారు. 
 
ముఖ్యంగా ఈ దెబ్బకు శరీరం నుంచి మెదడుకు రక్తాన్ని సరఫరా చేయడంలో వెర్టెబ్రల్ ఆర్టెరీ కీలక పాత్రపోషిస్తుంది. ఇది నలిగిపోవడంతో మెదడుకు రక్తం సరఫరా జరగలేదు. ఇది అత్యంత ప్రమాదకరమన్నారు. దీన్ని వైద్య పరిభాషలో వెర్టెబ్రల్ ఆర్టెరీ డిసెక్షన్ అంటారని వైద్యులు వివరించారు. ఈ తరహా ప్రమాదం అత్యంత అరుదైనదని, అతని మెదడుకు రక్తాన్ని సరఫరా పెంచేందుకు పుర్రెలో కొంత భాగం తొలగించామని అన్నారు. 
 
అనంతరం అతని మెదడుకు విశ్రాంతినిచ్చేందుకు అతనిని కోమాలోకి పంపారు. తర్వాత ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తుండగా తుదిశ్వాస విడిచినట్టు చెప్పారు. హ్యూస్ మృతితో క్రీడా ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. దిగ్భ్రాంతికి గురైన విషయం తెల్సిందే. ఇదిలావుండగా, ఈ హ్యూస్‌కు తగిలిన గాయంతో పాటు... బౌన్సర్ బంతులు, క్రికెట్ క్రీడపై ఇపుడు తీవ్రమైన చర్చ సాగుతోంది.