గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 12 జూన్ 2017 (07:52 IST)

గంగూలీ చెప్పాడు.. కోహ్లీ విన్నాడు.. అశ్విన్ వచ్చాడు.. టీమిండియా చేతిలో గేమ్

ఆట గెలిచి తీరాల్సిన సంక్లిష్ట క్షణంలో కేప్టెన్ తన భేషజాన్ని వీడి పెద్దలు చెప్పిన చెవిన వేసుకుని పాటిస్తే మొత్తం టీమ్‌కు ఎంత మేలు జరుగుతుందో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం జరిగిన కీలకమ్యాచ్ తేల్చి చెప్పేసింది. వన్డేల్లో నంబర్ వన్ జట్టుగా ఉన్న

ఆట గెలిచి తీరాల్సిన సంక్లిష్ట క్షణంలో కేప్టెన్ తన భేషజాన్ని వీడి పెద్దలు చెప్పిన చెవిన వేసుకుని పాటిస్తే మొత్తం టీమ్‌కు ఎంత మేలు జరుగుతుందో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం జరిగిన కీలకమ్యాచ్ తేల్చి చెప్పేసింది. వన్డేల్లో నంబర్ వన్ జట్టుగా ఉన్న దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలు చేయాలంటే టీమిండియా ప్రధాన స్పిన్నర్ అశ్విన్‌ని జట్టులోకి తీసుకోవాలని మాజీ కేప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆసీస్ దిగ్గజం మైకేల్ క్లార్క్ సరైన సమయంలో సలహా ఇచ్చారు. 
 
ఆ సలహాను కోహ్లీ పాటించడం నిజంగానే గేమ్ చేంజర్ అయింది. ఎంత శక్తివంతమైన ప్రత్యర్థి అయినా సరే తన బ్యాటింగ్‌తో అడ్డుగోడగా నిలబడి గేమ్‌ను అమాంతంగా సఫారీల వైపు మళ్లించే శక్తి ఉన్న హాషిం  అమ్లా పని పట్టే బాధ్యత అశ్విన్ తీసుకున్నాడు. ఆ విధంగా హాషీం ఎప్పుడైతే వికెట్ పోగొట్టుకున్నాడో అప్పటినుంచే దక్షిణాఫ్రికా సెమీస్‌కు దూరం కావడం ప్రారంభమైపోయింది. 
 
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో గత రెండు మ్యాచ్‌లలో జట్టులో చోటు దక్కించుకోని బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ను దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో ఆడించాలని కోహ్లీకి గంగూలీ, క్లార్క్ సూచించారు. దీంతో రవీంద్ర జడేజాను పక్కన పెడతారా అనే అనుమానాలు తలెత్తగా దీనికి గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. 
 
'అశ్విన్ తో పాటు రవీంద్ర జడేజా జట్టులో ఉండటం కీలకమే. అయితే హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టి అశ్విన్‌ను తీసుకుని ఐదుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగితే టీమిండియాకు కలిసొస్తుంది. బ్యాటింగ్ గురించి ఎవరికీ ఆందోళన లేదు. లంక మ్యాచ్‌లో బౌలర్లు తేలిపోవడం వల్లే టీమిండియా ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అశ్విన్‌ను తీసుకుంటే భారత బౌలింగ్ మరింత పటిష్టమవుతుంది. ప్రధాన మ్యాచ్‌లలో ఒత్తిడికి గురికావడం సఫారీలకే అలవాటేనని' గంగూలీ అభిప్రాయపడ్డాడు. కోహ్లీకి గంగూలీ చేసిన సూచనకు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ మద్దతు పలికాడు.
 
దిగ్గజాల సలహా మేరకు దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. గత రెండు మ్యాచ్‌లకు దూరమైన రవి చంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాపై అశ్విన్‌కు మంచి రికార్డు ఉండటంతో పాటు, ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఆ జట్టులో ఉండటం చేత అశ్విన్ తీసుకున్నారు.  అయితే గంగూలీ చెప్పినట్లుగా హార్దిక్ పాండ్యాను తప్పించడం కాకుండా ఉమేశ్ యాదవ్ స్థానంలో అశ్విన్ జట్టులోకి వచ్చాడు. 
 
ఎడమచేతి బ్యాట్స్‌మన్‌లను కట్టడి చేయాలనే టీమిండియా వ్యూహం నూటికి నూరుపాళ్లు ఫలించింది. అలాగే ఒత్తిడిలో సఫారీ జట్టు తేలిపోవడం ఖాయమని గ్రహించిన భారత జట్టు దానికి అనుగుణంగా ఫీల్డింగులో మెరిసిపోయింది. పరుగు తీస్తే చాలు రనౌట్ అయిపోతామేమో అనే గందరగోళంలో దక్షిణాప్రికా జట్టులో ముగ్గురు రనౌట్ కావడమే ఆటను మలుపు తిప్పింది.