మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 5 మార్చి 2017 (05:38 IST)

వణుకుకే వణుకును, ఒత్తిడికే ఒత్తిడిని నేర్పించిన ధీర బౌలర్ లియాన్

చాలా ఏళ్ల క్రితం అనిల్‌ కుంబ్లే భారత ఆటగాడిగా ఉన్న సమయంలో బెంగళూరులోనే భారత యువ స్పిన్నర్లకు పాఠాలు చెబుతూ వికెట్లు తీయాలంటే ఏం చేయాలి అని ప్రశ్నించారు. టర్న్, ఫ్లయిట్, బౌన్స్, వేరియేషన్‌... ఇలా ఎవరికి తోచింది వారు జవాబు చెబుతూ వచ్చారు. చివరకు కుంబ్ల

చాలా ఏళ్ల క్రితం అనిల్‌ కుంబ్లే భారత ఆటగాడిగా ఉన్న సమయంలో బెంగళూరులోనే భారత యువ స్పిన్నర్లకు పాఠాలు చెబుతూ వికెట్లు తీయాలంటే ఏం చేయాలి అని ప్రశ్నించారు. టర్న్, ఫ్లయిట్, బౌన్స్, వేరియేషన్‌... ఇలా ఎవరికి తోచింది వారు జవాబు చెబుతూ వచ్చారు. చివరకు కుంబ్లే మాత్రం ‘ఒత్తిడి’ అంటూ ఒకే మాట చెప్పారు. శనివారం కుంబ్లే టీమ్‌పై లయన్‌ చేసిందదే. ముందుగా వరుస ఓవర్ల పాటు పరుగులివ్వకుండా కచ్చితత్వంతో బౌలింగ్‌ చేయడం, ఆ తర్వాత సహజంగానే పెరిగిన ఒత్తిడి, అదే ఆవేశంలో వికెట్‌ సమర్పించుకోవడం! మాపై ఒత్తిడి లేదంటూ మ్యాచ్‌కు ముందు కోహ్లి ఎన్ని మాటలు చెప్పినా... చివరకు తనతో పాటు పుజారా, రహానే వికెట్లు చూస్తే చాలు అది ఎంత బాగా పని చేసిందో అర్థమవుతుంది! 

 
భారత క్రికెట్ జట్టును ఇటీవలి కాలంలో ఇంతగా భయపెట్టిన, ఒత్తిడికి గురి చేసిన బౌలర్ లేడంటే అతిశయోక్తి కాదు. అతడే లియోన్. ఆసీస్‌తో తొలి టెస్టులో పతనాన్ని పునరావృతం చేయడం మీ తరం కాదని టీమిండియా కెప్టెన్ కోహ్లీ చేసిన సవాలును మౌనంగా స్వీకరించిన లియోన్ శుక్రవారం ఉదయం బంతికి పని చెప్పాడు. అంతే బలమైన భారత్ బ్యాటింగ్ ఫోర్స్ పేకమేడలా కూలిపోయింది. భారత్‌పై అసాధ్యమైన రికార్డును బౌలర్‌గా సాదించాడతను 50 పరుగులకు 8 వికెట్లు. ఏ బౌలర్ అయినా స్వప్నంలో మాత్రమే సాధించగలిగిన ఫీట్‌ను నిజజీవితంలో సాఫల్యం చేసుకున్న ఘనత తనది. ఒక అసిస్టెంట్ క్యురేటర్ క్రికెటర్‌గా మారిన విజయపథానికి మరోపేరు లియాన్..ఏమా కథ
 
సరిగ్గా నాలుగేళ్ల క్రితం చెన్నైలో జరిగిన టెస్టులో ధోని కొట్టిన దెబ్బకు లయన్‌కు దిమ్మ తిరిగిపోయింది. ఆ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ చేసిన ధోని, ఒక్క లయన్‌ బౌలింగ్‌లోనే 9 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 104 పరుగులు రాబట్టాడు. అంతే... ఆ మ్యాచ్‌ ప్రదర్శన అతడిని చాలా కాలం వెంటాడింది. ఢిల్లీ టెస్టులో 9 వికెట్లు తీసినా, లయన్‌ ఆస్ట్రేలియా జట్టులో రెగ్యులర్‌ సభ్యుడు కావడానికి అది సరిపోలేదు. పేరుకు ప్రధాన స్పిన్నరే అయినా చాలా సందర్భాల్లో టెస్టు ప్రారంభమయ్యే సమయానికి కూడా తుది జట్టులో ఉంటాడో లేదో తెలీని పరిస్థితి. స్టార్‌ బౌలర్‌గా గుర్తింపు రాకపోయినా భారత్‌తో తాజా ప్రదర్శన అతని స్థాయిని పెంచిందనడంలో సందేహం లేదు. వార్న్‌ రిటైర్మెంట్‌ తర్వాత ఆస్ట్రేలియా 17 మంది స్పిన్నర్లను ప్రయత్నించగా, వారిలో ఇద్దరు మినహా ఎవరూ పది టెస్టులకు మించి ఆడలేకపోయారు. ఆ ఇద్దరిలో ఒకడైన లయన్‌ మాత్రం తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ 65 టెస్టుల పాటు కెరీర్‌ను సాగించగలగడం విశేషం.
 
అడిలైడ్‌ ఓవల్‌ మైదానంలో అసిస్టెంట్‌ క్యురేటర్‌గా పని చేసిన ఈ ఆఫ్‌ స్పిన్నర్‌ ప్రస్థానంలో ఎన్నో మలుపులున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో తాను వేసిన తొలి బంతికే సంగక్కరలాంటి దిగ్గజాన్ని అవుట్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఇతను, ఆ తర్వాత ఆసీస్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి టెస్టు (2014–15 అడిలైడ్‌)లో 12 వికెట్లతో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన లయన్, ఆస్ట్రేలియా పిచ్‌లపై కూడా ఆఫ్‌ స్పిన్నర్‌ ఎలాంటి ప్రభావం చూపించగలడో నిరూపించాడు.
 
మిస్టరీ బంతులు, దూస్రా లాంటివేమీ లేకుండా సంప్రదాయ ఆఫ్‌ స్పిన్నర్‌ తరహాలో ఫ్లయిట్, బౌన్స్, కచ్చితత్వంపై లయన్‌ ఆధార పడతాడు. పని రాక్షసుడిలా విరామం లేకుండా గంటల పాటు ప్రాక్టీస్‌ చేయడంలో నాథన్‌ తర్వాతే ఎవరైనా అని ఆసీస్‌ ఆటగాళ్లు చెబుతారు. ఇటీవల దుబాయ్‌లో అదే తరహాలో ఏకంగా 200 ఓవర్ల పాటు అతను నెట్స్‌లో బౌలింగ్‌ చేశాడు. కంగారూల జట్టులో ఇప్పుడు అందరికంటే సీనియర్‌ ఆటగాడైన లయన్‌ కీలక మ్యాచ్‌లో తన అనుభవాన్నంతా ఉపయోగించి జట్టును ముందంజలో నిలిపాడు.