శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Selvi
Last Updated : శనివారం, 19 మార్చి 2016 (13:39 IST)

టీ-20: భారత్-పాక్ మ్యాచ్‌.. ధోనీ సేనపై ఒత్తిడి.. చరిత్రపై పాక్ ఆందోళన!

ట్వంటీ-20 ప్రపంచ కప్: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌‌లో గెలిచేది ఎవరు?

ప్రపంచకప్ ట్వంటీ-20లో భాగంగా శనివారం కీలక మ్యాచ్ జరుగనుంది. వరుస విజయాలతో భారత్‌ టీ-20 వరల్డ్ కప్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు తొలి మ్యాచ్‌లో కివీస్‌ షాకిచ్చింది. ఫలితంగా భారత్ ప్రస్తుతం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పాకిస్థాన్‌తో శనివారం జరుగనున్న మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైతే ఇంటికి పోవాల్సిందే. 
 
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు కూడా మెరుగైన ఆటతీరుతో మెరుగుపరుచుకుంది. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌‍ల మధ్య జరుగనున్న మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నువ్వా నేనా.. అన్నట్టు సాగే ఫైనల్‌ను తలపించే ఈ మ్యాచ్ భారత్‌కు చావో రేవో అనేది తెల్చుకోవాల్సిన మ్యాచ్‌గా మిగిలిపోనుంది. మరి కోల్ కతా లోని ఈడెన్‌లో గెలిచేదెవరు అనేదానిపై ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
 
చిరకాల ప్రత్యర్థులైన భారత-పాకిస్థాన్‌ సమరం మరికొన్ని గంటల్లో ఆరంభంకానుంది. శనివారం రాత్రి 7:30 కు మొదలయ్యే ఈ మ్యాచ్‌కు ప్రతిష్ఠాత్మక ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికకానుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఇరు జట్లూ చెరో మ్యాచ్‌ ఆడేయడంతో నాకౌట్‌ అవకాశాలపై ప్రభావం చూపే ఈ పోరులో గెలవాలని ఇరు జట్లూ గట్టి పట్టుదలగా ఉన్నాయి. ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లో ఉండడం, సొంతగడ్డపై ఆడనుండడం, పైగా వరల్డ్‌కప్‌ ఈవెంట్లలో దాయాదిపై అజేయమైన రికార్డు ఉండడంతో ఈ మ్యాచ్‌లోనూ ధోనీసేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం ద్వారా దాదాపు నాకౌట్ అవకాశాలు దాదాపు ముగిసినట్లే. 
 
ఒకవేళ చాన్స్‌ ఉన్నా తర్వాతి మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌పై తప్పక గెలవాలి. గెలిచినా రన్‌రేట్‌, ఇతర జట్ల జయాపజయాల వంటి సమీకరణాలపై ఆధార పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి ఈ మ్యాచ్‌లో నెగ్గి సెమీస్‌ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవాలని ధోనీసేన భావిస్తోంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో బౌలర్లు రాణించి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసినా బ్యాట్స్‌మెన్‌ మూకుమ్మడి వైఫల్యం భారత ఓటమికి కారణమైంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ విభాగంపై భారత ఎక్కువ దృష్టి పెట్టనుంది. 
 
ఇక అఫ్రీది, ఇమాద్‌ వసీంలతో కూడిన స్పిన్‌ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. దీంతో.. భారత బ్యాట్స్‌మెన్‌ ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా మూల్యం చెల్లించుకోక తప్పదు. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించిన అఫ్రిదీ సేన ప్రపంచకప్ ఈవెంట్లలో భారత్‌పై ఎదురయ్యే వరుస పరాజయాల సంప్రదాయానికి బ్రేక్ వేయాలని భావిస్తోంది. అయితే చరిత్ర మాత్రం భారత్‌పైన పాకిస్థాన్ జట్టుకు విజయాలు సాధించిపెట్టలేదు. దీనిపైనే ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి ఈడెన్‌లో జరిగే పోరులో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఏ జట్టు గెలుస్తుందో అనేది వేచిచూడాలి.