గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : శనివారం, 13 జూన్ 2015 (11:17 IST)

కొసరి కొసరి... కేసీఆర్ తో తిట్టించుకుంటున్న టీడీపీ నాయకులు

పులి పంజా విసరొద్దంటే వింటుందా... పామును కాటేయవద్దంటే సమ్మతిస్తుందా.. తేలు కుట్టదంటే ఆగుతుందా.. అలాగే కేసీఆర్ ను తిట్టదంటే ఊరుకుంటాడా.. ఇదేదో భళే ఉందంటూ మరింత రెచ్చిపోయి తిడతాడు. తిట్టడంతో ఆయన జనాన్ని ఆకట్టుకున్న నేత.. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం నాయకులు ఆయన దగ్గర కొసరి కొసరి తిట్టించుకుంటున్నారు. ఆయనను కెలికి మరీ తిట్లదండకాన్ని చదవించుకుంటున్నారు. తిట్ట కూడాదనే ఆలోచన ఆయనకూ లేదు. తిట్టించుకోకూడదని వీరికీ లేదు. 
 
కేసీఆర్‌ ఇప్పుడు ఉద్యమ నేత కాదు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయినా ఆయన తీరులో ఏమాత్రం మార్పులేదు. మారితే నేను కేసీఆర్ కాదంటాడాయన, ఆంధ్రోళ్ళతో పంచాయితీ అయిపోలేదు.. అని ముఖ్యమంత్రి పీఠమెక్కుతూనే మనసులో మాట బయటపెట్టిన కేసీఆర్‌, ఆంధ్రోళ్ళపై కసిని ఇలా తిట్లతో ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారా? సన్నాసులు.. దద్దమ్మ... జేజమ్మలంటూ సహజంగా తిట్టే తిట్లకు మరిన్ని కలిపి లఫంగి అంటూ మరిన్ని తిట్లను కలిపి తిడుతున్నాడు. 
 
రెండు రాజకీయ పార్టీల మధ్య విమర్శలు సర్వసాధారణం. రెండు రాష్ట్రాల మధ్యా వివాదాలు తలెత్తొచ్చుగాక. అలాగని పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని, పొరుగు రాష్ట్రంలోని మంత్రుల్ని సన్నాసులనీ, కుక్కలనీ అనడం ఎంతవరకు సబబు.? ఇది సహజంగా ఎవరైనా పెద్దమనుషులు అడిగే ప్రశ్నే. కానీ అవన్ని ఆయనకు ఏ మాత్రం పట్టవు. 
 
తెలంగాణలో రాజకీయంగా టీఆర్‌ఎస్‌కి తిరుగులేదు. ఇంకో నాలుగేళ్ళు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి డోకా లేదు. ఇప్పుడేమీ ఉద్యమాలు నడపాల్సిన అవసరం టీఆర్‌ఎస్‌కి అసలే లేదు. అయినా ఆయన తిడుతూనే ఉంటారు. కారణం తనదైన శైలిలో వేడి తగ్గకూడదు. పదునుపోకూడదు. అప్పుడే మరో పార్టీ తెలంగాణలో కోలుకునే అవకాశం లేకుండా చేయవచ్చు. అదీ ఆయన పథకం. ఇది తెలియని ఆంధ్ర తెలుగుదేశం నాయకులు అప్పడప్పుడూ ఆయనను రేపెడుతుంటారు. 
 
ఆయనదేం నోరా... దానికన్నా హుస్సేన్‌సాగర్‌ నయ్యం.. పాయకానా ఇంకా నయ్యం.. అనే విమర్శలు చేయడం మొదలు పెట్టారు. దీంతో ఆయన మరింత రెచ్చిపోయారు. దాంతోపాటుగా కేసీఆర్‌కి ముఖ్యమంత్రి స్థాయి ఏంటో తెలియడంలేదింకా.. అనే విమర్శలకు అవకాశమివ్వడమో తప్ప, కేసీఆర్‌ ఏం సాధిస్తారు? అన్న చర్చ తెలంగాణ సమాజంలోనే జరుగుతోంది.
 
ఒళ్ళు మండినా.. మండకపోయినా కేసీఆర్ ప్రత్యర్థులను తిట్టడంలో దిట్ట. సరిగ్గా ఆయనను తెలుగుదేశం నాయకులు కలబెట్టి మరీ తిట్టించుకుంటున్నారు. కాంగ్రెసోళ్ళని తిడతారు. టీడీపీ నేతల్ని తిడతారు. పొరుగు రాష్ట్రానికి చెందిన నేతల్ని తిడతారు అంతే. మరి, ఆయన్నెందుకు ఎవరూ అంత ఘాటుగా తిట్టరు?  ఈ మధ్యలో తెలుగుదేశం నాయకులు ఆయన నోటిపై కామెంటు చేశారు. ఇది ఆయనకు మరింత మండించింది. లఫంగులు... కుక్కలంటూ కొత్త పదాలను కలిపి తిట్టడం మొదలు పెట్టారు. చివరకు నా వెంట్రుకలు పీకలేరని మాట్లాడడం మరీ దారుణం.