శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (13:50 IST)

బలపరీక్ష.. రెసార్ట్ నుంచి ఎమ్మెల్యేలను వదిలిపెట్టండి... పన్నీర్ క్యాంప్ సవాల్... ఆర్కే నగర్‌ నుంచి దీప పోటీ?

తమిళనాడు సీఎంగా పళని స్వామి ప్రమాణ స్వీకారం చేయడంతో సమసిపోయిందనుకున్న తమిళ రాజకీయ సంక్షోభం మళ్లీ మొదలైంది. రెసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలను బయటికి వదలకుండా బలాన్ని నిరూపించుకునేందుకు చిన్నమ్మ సలహాలను పాట

తమిళనాడు సీఎంగా పళని స్వామి ప్రమాణ స్వీకారం చేయడంతో సమసిపోయిందనుకున్న తమిళ రాజకీయ సంక్షోభం మళ్లీ మొదలైంది. రెసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలను బయటికి వదలకుండా బలాన్ని నిరూపించుకునేందుకు చిన్నమ్మ సలహాలను పాటిస్తున్న పళని స్వామికి చెక్ పెట్టేందుకు పన్నీర్ సెల్వం సిద్ధమయ్యారు. అమ్మ సమాధి సాక్షిగా శపథం చేసి మరీ చిన్నమ్మ సర్కారును కూల్చేస్తానని ప్రకటించారు. దీంతో తమిళ రాజకీయ సంక్షోభానికి ఇప్పటికే తెరపడేలా లేదు. 
 
ఇందులో భాగంగా అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళను బహిష్కరిస్తున్నట్లు మధుసూధనన్ సంచలన ప్రకటన చేశారు. ఆమెతో పాటు పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్, వెంకటేశ్‌ను కూడా పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. పార్టీ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించే హక్కు శశికళకు లేదని, పార్టీ నిర్వహణ అంతా ప్రిసీడియం చైర్మన్ అయిన తన ఆధీనంలోనే ఉంటుందని తేల్చి చెప్పారు. దీంతో అన్నాడీఎంకే పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు. 
 
మరోవైపు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి.. ఆపై అమ్మ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నుంచి పోటీచేసి గెలవాలనుకుంటున్న చిన్నమ్మ ఆశలకు ఇప్పటికే గండికొట్టారు. జయ కేసులో చిన్నమ్మ జైలుకు వెళ్లిపోయింది. కానీ జైలు నుంచే ఆర్కే నగర్ నియోజక వర్గం నుంచి తన అక్కకొడుకు దినకరన్‌ను బరిలో దించాలని చిన్నమ్మ వ్యూహాం రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. జైలు నుంచే సీఎం పళనిస్వామి చేత తన ఎత్తుగడలను అమలు చేయించాలని భావిస్తున్న శశికళ.. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యూహాన్ని తిప్పికొట్టే దిశగా పన్నీర్ సెల్వం క్యాంప్ రెడీ అయిపోతోంది. 
 
కాగా, ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. ఈ లెక్కన అమ్మ మరణించి 2నెలలు పూర్తయిపోవడంతో ఇక మిగిలింది కేవలం నాలుగు నెలలు మాత్రమే. ఈ నేపథ్యంలోనే శశికళ చకచకా పావులు కదపాలని యోచిస్తున్న శశికళ.. ఆర్కేనగర్ నుంచి దినకరన్‌ను బరిలో దింపాలనే ఆలోచనలో ఉన్నారు. పళనిస్వామి మంత్రివర్గంలోను దినకరన్‌కు చోటు దక్కుతుందని అంతా భావించినా.. ఎమ్మెల్యే కాని వ్యక్తికి మంత్రిపదవి కట్టబెట్టడం విమర్శలు కొనితెచ్చుకున్నట్లవుతుందని ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఆర్కేనగర్ నుంచి గనుక దినకరన్ విజయం సాధిస్తే అప్పుడు అతనికి కీలక మంత్రిపదవి కట్టబెట్టే అవకాశం ఉంది.
 
శశికళ వ్యూహం బాగానే ఉన్నా.. చిన్నమ్మే వద్దన్న వారు ఆమె అక్క కొడుకు ఆదరిస్తారా? అన్నది అనుమానమే. కాగా, ప్రస్తుతం దినకరన్ అన్నాడీఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శశికళతో పోరులో పన్నీర్ సెల్వంకు మద్దతుగా నిలిచిన జయలలిత మేనకోడలు దీపజయకుమార్‌ను పన్నీర్ సెల్వం వర్గం ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని యోచిస్తోంది. 
 
ఆర్కేనగర్ వాసులకు శశికళ పట్ల వ్యతిరేకత ఉండటం.. అచ్చు అమ్మ పోలికలతోనే ఉన్న దీపకు ఆర్కేనగర్ ఎన్నికలో  కలిసొస్తుందనేది పన్నీర్ ఆలోచన. దీపజయకుమార్ ను ముందుపెట్టి రాజకీయం నెరిపితే.. పళనిస్వామి వర్గం నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలను తన చెంతకు చేర్చుకోవచ్చు అని పన్నీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మద్దతు ఇవ్వడానికి ఎటూ డీఎంకె సిద్దంగా ఉంది కాబట్టి పన్నీర్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
 
ఇంకా పన్నీర్ వర్గం పళని స్వామికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించింది. రెసార్ట్‌లో బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలను ధైర్యం వుంటే వదిలిపెట్టమని సవాలు విసురుతోంది. చిన్నమ్మ బెదిరింపులకే ఎమ్మెల్యేలు రెసార్ట్‌లో జడుసుకుని వున్నారని.. ప్రజల ఆదరణతో ప్రజాప్రతినిధులైన వారు ఇలా ప్రజా వ్యతిరేకమైన చిన్నమ్మ సర్కారుకు ఎలా మద్దతిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో రెసార్ట్ లోని ఎమ్మెల్యేలు ముందు ఈ లగ్జరీ రెసార్ట్ నుంచి బయటికొస్తే చాలునని భావిస్తున్నారు. కానీ పళనిస్వామి సీఎం అయ్యాక చాలామంది ఎమ్మెల్యేలు రెసార్ట్‌ను ఖాళీ చేశారని శశివర్గం నేతలు అంటున్నారు. అయితే బలపరీక్ష వరకు వారిని బయటికి వదిలిపెట్టలేదని తమిళ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.