బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PY REDDY
Last Updated : మంగళవారం, 23 డిశెంబరు 2014 (18:19 IST)

అదే తప్పు.. మళ్లీ అన్నీ రాజధానిలోనేనా..?

సాధారణంగా జరిగిన తప్పిదాలు, పొరబాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం సహజం. అది మరోమారు జరగకుండా జాగ్రత్త పడడం వివేకవంతుల పని. రాష్ట్రం విడిపోక మునుపు జరిగిన తప్పును పునరావృతం కాకుండా చూస్తామని అన్ని పార్టీలు పదేపదే మైకులు విరిచి మరీ చెప్పాయి. అభివృద్ధిని రాష్ట్రమంతటా పరుస్తామని ఢంకా భజాయించి చెప్పారు. వారిలో తెలుగుదేశం పార్టీ, వైసిపీలు ఓ అడుగు ముందే ఉన్నాయి. మరి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నదేమిటీ? అన్నింటిని కృష్ణా నదికి అటు ఇటుగా రెండు జిల్లాల నడుమ ఏర్పాటు చేయడానికి తహతహలాడుతున్నారెందుకు? ఇలా చేయడం వలన రాష్ట్రంలో పైనా కింద ఉన్న ప్రాంతాలు ఏమి కావాలి? రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలకు మరోమారు బీజం వేస్తున్నారా..? శాసనసభలో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్డిఏ) బిల్లును ప్రవేశపెట్టారు. దానిపై చర్చ అన్నారు. ఎక్కడ జరిగింది చర్చ. ఏమి చర్చ జరిగింది ? ఇందులో కనిపిస్తున్నదంతా ఒకటే. పచ్చటి పంట పొలాలను భారీ ఎత్తున రైతుల నుంచి లాక్కోవడం ఒకటే లక్ష్యంగా కనిపిస్తోంది. 
 
అది లక్ష ఎకరాలు లేదా అంతకు పైగానే ఉండవచ్చుననే వాదన వినిపిస్తోంది. ఇక్కడే అనుమానాలకు బీజం పడుతోంది. మొన్నటికి మొన్న చంద్రబాబు హైదరాబాద్ ను పోలిటికల్ రాజధానిగానూ, విజయవాడను పాలనాపరమైన కేంద్రంగాను ప్రకటించారు. మరి కేవలం పాలనాపరమైన కేంద్రం వరకే పరిమితం చేయదలుచుకున్నా.. పదివేల ఎకరాలు సరిపోతాయని చాలా రాష్ట్రాల రాజధానుల అనుభవాలు చెపుతున్నాయి. మరి ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ప్రస్తుతం రాజధానికి ఎంపిక చేసుకున్న ప్రాంతంలో 25 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని గుర్తించామన్నారు. మరి అలాంటప్పుడు ఇంకా 15 వేల ఎకరాలు మిగిలిపోయే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు రైతుల నుంచి లక్షలకు లక్షల పంట పొలాలను ఎందుకు సేకరిస్తున్నాట్లు అనేది అనుమానాలకు తావిస్తోంది. 
 
రాజధాని ప్రతిపాదిత ప్రాంతం
అనేక సందర్భాలలో చంద్రబాబు హైదరాబాద్ ను తలదన్నే స్థాయిలో నగరాన్ని నిర్మిస్తామని చెబుతూ వచ్చారు. అంటే అర్థం ఏమిటి? మళ్లీ హైదరబాద్ తరహాలోనే అన్ని సంస్థలను అక్కడే కుక్కి రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలను ఒట్టిపోయేలా చేస్తారా? అనే అనుమానాలను బలపరుస్తున్నాయి. సాధారణంగా అభివృద్ధి, మౌలిక వసతులు ఎక్కడైతే ఉంటాయో, అక్కడ వాటంతట అవే అన్ని సంస్థలు తమ శాఖలను విస్తరిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు, సహకార రంగాలన్నింటికి ఇదే వర్తిస్తుంది. మరి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పన గాలికి వదిలేసి రాజధాని చుట్టూ కాలం గడిపేస్తున్నారు. ఫలితంగా కేంద్రం మంజూరు చేసిన సంస్థలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూడా ప్రయత్నం చేయడం లేదనేది వేర్వేరు ఉదాహరణలలో స్పష్టమవుతోంది. 
 
అనంతపురంలో కేంద్ర వర్శటీ, తిరుపతిలో ఐఐటి, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయాలు ఒక్క అడుగు ముందుకు పడటంలేదు. ఇక్కడ వసతులు లేవంటూ కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ సంస్థల స్థాపన సత్వర నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిందల్లా ఒకటే. మంగళగిరిలో ఎయిమ్స్ స్థాపనకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశారు. అదేమో శంఖుస్థాపన వరకూ వెళ్ళిపోయింది. ఈ ప్రాంతం రాజధానిలో భాగమే. రాజధాని, రాజధాని చుట్టూ ఉన్న ప్రాంతాలను మినహా మరే ప్రాంతాల అభివృద్ధి ఆచరణ ఒక్క అడుగు కూడా ముందు పడటం లేదు. ఇలాగే జరిగితే ఉత్తరాంధ్ర, ప్రకాశం నుంచి రాయలసీమ వరకూ మరోమారు వివక్షకు గురికాక తప్పదు. మరి అప్పుడు ఆ అసంతృప్తి ఎలాంటి దారులు వెతుక్కుంటుందో చూడాల్సిందే.