శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Eswar
Last Modified: గురువారం, 17 జులై 2014 (12:15 IST)

అమిత్ షా, ఆపరేషన్ తెలంగాణకు రంగం సిద్ధం

ఇప్పుడు బీజేపీ అమిత్ షా దృష్టి తెలంగాణ రాష్ట్రంపై పడింది. ఒక్క యూపీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చాలు అమిత్ వ్యూహ చతురతకి. ఆ ఫలితాలే బీజేపీ అధ్యక్ష పదవి దక్కేలా చేసింది. ఇప్పుడు తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలపై దృష్టిపెట్టారు. అమిత్ దృష్టి కేంద్రీకరించిన రాష్ట్రాల్లోని పార్టీలు లోలోపల గుబులుపడుతున్నాయి. ఇప్పటికే యూపీలో సమాజ్‌వాది పార్టీని చీల్చే పనిలో పడ్డారు అమిత్ షా. శాంతిభద్రతలు క్షీణించాయన్న నెపంతోనో లేక అవిశ్వాస తీర్మానంతోనో సమాజ్‌వాదీ పార్టీ పని పట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. 
 
అమిత్ షా వర్సెస్ కేసీఆర్ 
2014 ఎన్నికల్లో యూపీలో బీజేపీకి తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించి పెట్టిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంపై దృష్టి పెట్టారు. ఇందుకు సంబంధించిన వ్యూహాలను అమిత్ షా వర్గం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ తెలంగాణ పేరుతో తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని అమిత్ షా భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యూహచతురత ముందు అమిత్ షా పప్పులు వుడకవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
తెలంగాణలో బీజేపీ తెలుగుదేశంతో పొత్తుపెట్టుకున్నప్పటికీ టీఆర్ఎస్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడమే అందుకు నిదర్శనమంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ పట్ల బీజేపీ వివక్ష చూపిస్తోందని టీఆర్ఎస్ కూడా బీజేపీపై తనదైన దూకుడును ప్రదర్శిస్తోంది. పోలవరం బిల్లును పార్లమెంటులో ఆమోదించడం, ఏపీకి పైలెట్ ప్రాజెక్టు కింద నిరంతర విద్యుత్‌ను ప్రకటించడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శల్ని చేస్తోంది.
 
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలని ఆశిస్తున్న నేపథ్యంలో అందుకు అనువైన వేదిక తెలంగాణ రాష్ట్రమేనని బీజేపీ  సీనియర్లు లెక్కలు వేశారు. తెలంగాణ లో పాగా వేసేందుకు ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలన్నదానిపైనే అమిత్ వ్యూహాలు రచించే పనిలో పడ్డారని సమాచారం. మరి అమిత్ షా వేయనున్న ఎత్తులకు కేసీఆర్ ఏ మేరకు చెక్  పెడతారో వేచి చూడాలి.
 
యూపీలో మధ్యంతర ఎన్నికలకు అమిత్ వ్యూహం...
 
యూపీలో సమాజ్ వాదీ పార్టీని చీల్చి మధ్యంతర ఎన్నికలకు తెరతీయాలని కూడా అమిత్ షా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. యూపీలో మధ్యంతర ఎన్నికలు జరిగితే బీజేపీ కచ్చితంగా గెలుస్తుందనే లెక్కలు వేసుకుంటున్నారు. త్వరలో మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కూడా అమిత్ షా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.