శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr

తెదేపా వైపే మొగ్గు చూపుతున్న ఆనం బ్రదర్స్.. బాబు అనుమతే తరువాయి?

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానంద రెడ్డిలు కాంగ్రెస్‌ పార్టీని వీడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీరిద్దరు సైకిల్ ఎక్కేందుకు మానసికంగా సిద్ధమైపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఆనం రామనారాయణ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబు పాలనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారనే టాక్ లేకపోలేదు. 
 
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్‌తోనే నడిచినా 1982లో టీడీపీ ఆవిర్భావంతో రామనారాయణ రెడ్డి పార్టీలో చేరి రాపూరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో రాపూరు నుంచి మరోసారి టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ఎన్టీఆర్‌ కేబినెట్‌లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం జిల్లాలోని రాజకీయ సమీకరణాల కారణంగా టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. 1999, 2004లో రాపూరు నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్‌ కేబినెట్‌లో మంత్రిగా చేశారు. 
 
2009లో ఆత్మకూరు నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచి రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి మంత్రి వర్గంలో ఆర్థికమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రజల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకతను గుర్తించి 2014 ఎన్నికలకు ముందు పార్టీ మారేందుకు ప్రయత్నించారు. సమీకరణాలు అనుకూలించక పోవడంతో చివరకు కాంగ్రెస్‌ అభ్యర్థిగానే బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. నాటి నుంచి కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌ కోలుకొనే పరిస్థితి లేకపోవడం.. వైసీపీకి పెద్దగా ప్రజాదరణ లభించకపోవడం వంటి కారణాలతో ఆనం టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
 
దీనిపై ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్‌ పార్టీ దుస్థితికి అధిష్టానమే కారణమని, నాయకత్వమే తమ నెత్తిన మట్టేసిందని, ఇప్పుడు మట్టి సత్యాగ్రహంతో సాధించేది ఏమీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పనితీరుపైనా ప్రశంసలు కురిపించారు. టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యే ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. రాజకీయాల్లో ఆనం బ్రదర్స్‌ నిర్ణయాలన్నీ సమష్టిగానే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఆనం రామనారాయణరెడ్డితోపాటు వివేకా కూడా టీడీపీలో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది.