మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2015 (18:30 IST)

ఆ ఎన్‌కౌంటర్‌తో కేసీఆర్ ''బుల్లెట్''... ఈ ఎన్‌కౌంటర్‌తో బాబు మెడకు ''గుదిబండ''

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో ఉగ్రవాదులు పోలీసులపై దాడి చేసినందుకు సిమీ ఉగ్రవాది వికారుద్దీన్, అతని అనుచరులు ఖాకీల తూటాలకు బలయ్యారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్ర చందనం స్మగ్లర్లపై విరుచుకుపడిన పోలీసులు, 20 మందిని కాల్చి చంపారు. అయితే ఈ కాల్పుల్లో చనిపోయిన వారంతా పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన కూలీలే. దీంతో చంద్రబాబు నాయుడు సర్కారు తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎదుర్కొంటోంది కూడా.
 
ఈ రెండు ఎన్‌కౌంటర్ల నేపథ్యం వేర్వేరుగా ఉన్నప్పటికీ.. తిరుపతి శేషాచల అడవుల్లో జరిగిన ఎర్ర చందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌ దేశ వ్యాప్తంగా సంచలనమైంది. దీనికి ప్రధాన కారణం ఎన్‌కౌంటర్ జరిగిన తీరే. ఫలితంగానే కేవలం ఏపీలోని విపక్ష రాజకీయ (జగన్ పార్టీ, టీడీపీ మినహా) పార్టీలు, ప్రజా సంఘాలు టీడీపీ సర్కారు తీరును తూర్పారబట్టాయి. వీరికి మరింత బలం చేకూర్చేలా ఈ ఎన‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటాగా స్వీకరించింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేయడం. అలాగే, పలువురు న్యాయకోవిదులు సైతం ఎన్‌కౌంటర్ జరిగిన తీరును తప్పుబట్టారు. కేంద్రం హోం శాఖ కూడా నివేదిక కోరింది. పైపెచ్చు.. ఈ ఎన్‌కౌంటర్ కేసును విచారించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం ముందుకు రావడం చంద్రబాబు సర్కారుకు తీవ్ర ఇబ్బందిగా మారింది. 
 
ఇకపోతే.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద అర్థరాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు(సిమీ కార్యకర్తలు) వ్యక్తులను పోలీసులు ప్రశ్నించడమే సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌కు నాందిపలికింది. ఆ అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించిన పాపానికి సిమీ కార్యకర్తలు పోలీసులపై తెగబడ్డారు. ఫలితంగా ఈనెల 4వ తేదీ వేకువజామున చోటు చేసుకున్న కాల్పుల్లో ఘటనా స్థలంలోనే ఒక హోంగార్డు, ఒక కానిస్టేబుల్ మృత్యువాతపడగా, ఈ ఉగ్రమూకల కాల్పుల్లో గాయపడిన ఎస్ఐ సిద్ధయ్య కన్నుమూశారు. అయితే, సూర్యాపేటలో కాల్పులకు తెగబడిన ఉగ్రమూకలను సరిగ్గా 48 గంటల్లోపే తెలంగాణ పోలీసులు మట్టుబెట్టారు. ఇంతవరకు జరిగిన వ్యవహారం పెద్దగా చర్చకు దారితీయలేదు. 
 
అయితే ఈనెల 6వ తేదీన ఓ కేసు విచారణ నిమిత్తం వరంగల్ జైలు నుంచి హైదరాబాద్‌కు ఉగ్రవాది వికారుద్దీన్, అతని అనుచరులను పోలీసు వ్యానులో తీసుకొస్తుండగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో వికారుద్దీన్ అండ్ గ్యాంగ్ హతమైంది. హైదరాబాద్‌కు తరలించే సమయంలో వికారుద్దీన్ తన నోటికి పని చెప్పినట్లు సమాచారం. "ఇద్దర్ని చంపగానే హీరోలయిపోయారా అంటూ పోలీసులను బూతులు తిడుతూనే" పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కుని వారిపై దాడి చేసి పరారయ్యేందుకు ప్రయత్నించడంతో తమ ఆత్మరక్షణార్థం కాల్పులు జరుపగా వారు హతమైనట్టు పోలీసులు చెపుతున్నారు.
 
అయితే, వీరు ఎలా చనిపోయారన్నది పక్కన బెడితే ఈ ఎన్‌కౌంటర్‌పై కేవలం ఎంఐఎం పార్టీ ఒక్కటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. కానీ, సిమీ కార్యకర్తల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని విపక్ష పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుని విమర్శలు సంధిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు లేకుండా ఉగ్రవాదులను ఎదుర్కోవడం ఎలా సాధ్యమనీ, చేతుల్లో ఆయుధాలు లేకుండా ఎలా పోరాడుతారు.. అంటూ ఇలా అనేక రకాలైన విమర్శలు వచ్చాయి. మొత్తమ్మీద ఈ ఘటన కారణంగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు వచ్చినప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం పోలీసుల మీద ఈగ వాలినా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పకనే చెప్పినట్లయింది. అలా ఒకరకంగా ఆయన హీరోగా నిలిచారు.
 
అదేసమయంలో శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ ఆంధ్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. స్మగ్లర్లను వదిలేసి సాధారణ కూలీలపై కాల్పులు జరిపి వారి ప్రాణాలను తీయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తమిళనాట పలు రాజకీయ పార్టీలు ఆందోళనలకు దిగాయి. బూటకపు ఎన్‌కౌంటర్ అని మండిపడ్డాయి. అమాయకులను బలి చేశారంటూ రోడ్డెక్కారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో లాంటి వారు తక్షణం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇలా శేషాచలం ఎన్‌కౌంటర్ బాబు మెడకు గుదిబండలా మారిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.