శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: గురువారం, 25 ఫిబ్రవరి 2016 (12:10 IST)

ఏపీలో వలసల ‘వార్’... ఎన్నుకున్న ప్రజలు ఏమనుకుంటారో పట్టదా...?

భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ పార్టీ ఫిరాయింపులను ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకించాలి.

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన పార్టీల మధ్య వలసల వార్ జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఐదుగురు ఎం.ఎల్.ఎ.లు, ఒక ఎమ్మెల్సీ  సైకిలెక్కడంతో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి గండి తెగినట్లయింది. ఇంకా ఇంకొందరు యం.ఎల్.ఎ.లు సైకిలెక్కడానికి సిద్ధంగా ఉన్నారనే ఊహాగానాలు కొనసాగుతాయి. తెలంగాణాలో టి.ఆర్.యస్. పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనూ చోటుచేసుకుంది. తెలంగాణాలోని టి.ఆర్.యస్. లోకి తెలుగుదేశం పార్టీ నుండి భారీ వలసలు కొనసాగి, ప్రస్తుతం అక్కడ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణా రాష్ట్ర సమితి తెదేపా అభ్యర్థులను తమ పార్టీలోకి తీసుకుంటున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత-నాయకులు తీవ్రంగా ఆపార్టీ తీరును దుయ్యబట్టారు.
 
ప్రారంభంలో ఆపరేషన్ ఆకర్ష్ పట్ల పెద్దగా ఆసక్తి చూపని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రతిపక్ష సభ్యులను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి పచ్చ జెండా ఊపారు. దీనికి  ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, పార్టీని మరెంత బలోపేతం చేయాలనే సంకల్పం, పార్టీ భవిష్యత్తు పట్ల నెలకొన్న భయం కారణాలుగా చెప్పుకోవచ్చు. తెలంగాణాతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కూడా ప్రతిపక్షానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ ఆ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో జగన్ పూర్తిగా వైఫల్యం చెందారనే చెప్పాలి. 
 
పార్టీ నాయకులతో కలివిడిగా మసలని నైజం, మనసువిప్పి మాట్లాడని తత్త్వం జగన్‌కు – ఆయన పార్టీ నాయకుల మధ్య అగాధాన్ని పెంచుతున్నాయి. ఇటువంటి తరుణంలోనే జగన్ అధికార పక్షంలో అసంతృప్తిగా ఉన్న యం.ఎల్.ఎ.లను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికార పార్టీ గమనించింది. అంతటతో ఆగక జగన్ అధికార ప్రభుత్వాన్ని గంటలో కూల్చుతానని బహిరంగంగా ప్రకటించడంతో  తెలుగుదేశం పార్టీ స్వీయ రక్షణలో పడింది. జగన్ ఎత్తుకు పైఎత్తుగా ముందుగానే అధికార పక్షం స్పందించి గత కొద్దీ కాలంగా తమ పార్టీలోకి రావడానికి సమాలోచనలు జరుపుతున్న ప్రతిపక్ష నాయకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిలిచిందే తడువుగా ఐదుగురు యం.ఎల్.ఏ.లు, ఒక యం.ఎల్సీ. తెలుగుదేశం తీర్ధాన్ని పుచ్చుకోవడంతో జగన్ మోహన్ రెడ్డికి దిమ్మతిరిగింది. ఇప్పటికైనా ప్రతిపక్షనేత జగన్ తమ తీరు మార్చుకోకుంటే మరికొందరు యం.ఎల్.ఎ.లు తెదేపా వైపుకు మొగ్గు చూపే ప్రమాదం లేకపోలేదు. 
 
రానున్న శాసనసభ సమావేశాల నాటికి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో జగన్ తప్ప ఇంకెవరు ఉండరని అధికార పక్ష నాయకులంటుంటే, సంవత్సర కాలంలో మళ్ళీ వారంతా తమ పార్టీలోకే వస్తారని జగన్ జ్యోస్యం చెబుతున్నారు. వెన్నుపోటు రాజకీయాలను బాగా అవపోసన పట్టిన చంద్రబాబుకు పార్టీ ఫిరాయింపులను పోత్సహిస్తూ తన తీరును మళ్ళీ చాటుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, ఆపరేషన్ ఆకర్ష్‌ను రాష్ట్ర రాజకీయాలకు పరిచయం చేసింది జగన్ తండ్రి రాజశేఖర రెడ్డేనని అధికార పక్షం అంటుంది.  ప్రతిపక్ష యం.ఎల్.ఏలను లోబర్చుకొని చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేస్తున్నారని, పార్టీ విడిచి వెళ్ళేవారంతా పార్టీకి – పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలవాలని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. 
 
జగన్ మొండి వైఖరి - నియంతృత్వ పోకడలకు తట్టుకోలేకే ప్రతిపక్ష యం.ఎల్.ఎ.లు, నాయకులు తమ పార్టీలోకి క్యూలు కడుతున్నవారని అధికార పక్ష నాయకులు సమాధానమిస్తున్నారు. అటు తెలంగాణాలో గానీ – ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ నాయకులు చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. వీరంతా చెబుతున్న ఒకే ఒక మాట “అభివృద్ధి కోసం అధికార పక్షంలోకి వచ్చాం” అని, అసలు ఇది సరైన సమాధానం అవుతుందా? ప్రజలు తమకు ఏ పార్టీని చూసి ఓట్లు వేశారనే సంగతి పక్కన పెట్టి కేవలం తమ రాజకీయ, వ్యాపార, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలోకి కప్పగంతులు వేస్తున్న రాజకీయ నాయకులకు భవిష్యత్తులో ఈ ప్రజలే ఓటుతో దిమ్మతిరిగే సమాధానం ఇవ్వక మానరు. గతంలో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ.
 
పార్టీ ఫిరాయింపులపై స్పష్టమైనా చట్టాలు, అమలు లేకపోతే ప్రతి రాజకీయ పార్టీ రానున్న రోజుల్లో ఇదే సమస్యను చవిచూడక తప్పదు. ఈ వైఖరిని రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరముంది. మేథావులు సదస్సులు ద్వారా  ప్రజలను చైతన్యపర్చాలి. భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ పార్టీ ఫిరాయింపులను ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకించాలి.
- డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్, తెలుగు లెక్చరర్, తెనాలి (ఆంధ్రప్రదేశ్)