బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : ఆదివారం, 15 మే 2016 (12:54 IST)

ఏపీలో సెగలు రేపుతున్న ప్రత్యేక హోదా : బీజేపీ - టీడీపీ దాగుడుమూతలు.. విపక్షాల ఫైర్!

ఏపీలో సెగలు రేపుతున్న ప్రత్యేక హోదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశం సెగలు రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఊపందుకునే దిశగా పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. హోదాను పోరాడి సాధించుకుంటామని అధికార పార్టీ నాయకులు అంటుంటే.. టీడీపీ, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్చార్జ్‌ సిద్ధార్థ్ నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. హోదా కోసం తమ పొరాటం కొనసాగుతుందని మంత్రులు స్పష్టం చేశారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూనే హోదా సాధించుకుంటామని ధీమా వ్యక్తంచేశారు.
 
బీజేపీ తన మనసులోని మాటను సిద్ధార్థ్ నాథ్ సింగ్‌తో తేటతెల్లం చేయించినా టీడీపీ, బీజేపీ నేతలు మాత్రం పోరాడి సాధించుకుంటామని చెప్పడం కేవలం కంటితుడుపు చర్యగా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం అధికారం కోసమే ప్రజలను మభ్యపెట్టేలా ప్రకటనలు గుప్పిస్తున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇదే అంశంపై ఏపీ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరా రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలు దాగుడుమూతలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ప్రజలను మోసగించడంలో ఆ రెండు పార్టీలూ దొందూ దొందేనని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోడీ కప్పదాటు ధోరణి అవలంభిస్తుండగా, చంద్రబాబు తాను ఇచ్చిన వాగ్ధానాల్లో ఒక్కటీ నిలబెట్టుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అలాగే, వైకాపా నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. స్వార్థం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. విభజన చట్టంలోని అంశాలను మినహా, ప్రత్యేక హోదాను చంద్రబాబు కోరలేదంటూ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇనచార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌తో పాటు కేంద్ర మంత్రులు ఘంటాపథంగా చెబుతున్నా, సీఎం, ఆయన మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.