గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: మంగళవారం, 13 అక్టోబరు 2015 (13:18 IST)

ఏపీ లేస్తోంది... తెలంగాణ పడుతోందా...? ఏంటి సంగతి...?

ఇప్పుడు దీనిపైనే చర్చ. ఏపీ ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామ్యం కావడంతో నిధులను ఎలాగోలా రాబట్టుకుంటోంది. ప్రత్యేక హోదా వ్యవహారం ఎలా ఉన్నా కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులను రాబట్టుకోవడంలో సక్సెస్ అవుతోంది. ఎన్డీయేలో తెదేపా మంత్రులు ఉండటంతో అక్కడ పని సుళువవుతోందని అంటున్నారు. దీనికితోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన దగ్గర్నుంచి ఏపీకి చెందిన 8 జిల్లాల్లో రియల్ భూమ్ ఆకాశాన్ని తాకేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల సంగతైతే వేరే చెప్పక్కర్లేదు. ఒకప్పుడు లక్షన్నరకే కొనే దిక్కులేని ఎకరం ధరు ఇప్పుడు ఏకంగా 5 నుంచి 9 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. దీంతో ఆ జిల్లాల పరిధిలోని ప్రజల్లో అధికులు తమకు కావాల్సిన మేర భూమి అమ్మేసుకుని ఓ ఇల్లు, ఓ కారు, పిల్లలకు మంచి చదువు లెక్కలతో ముందుకు వెళ్లిపోతున్నారు. 
 
దాదాపు సీమ జిల్లాల్లో ఒకట్రెండు, ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలు తప్పించి ఆంధ్రలో అంతటా వ్యాపారం కూడా మంచి జోష్ మీద ఉందని చెపుతున్నారు. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలన్న చంద్రబాబు నాయుడు లక్ష్యం సక్సెస్ అయ్యేట్లే ఉందని విశ్లేషకులు అంటున్నారు. దీనికి కారణం ఆమధ్య పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంలో ఏపీ నెం.2 స్థానాన్ని సాధించడమే అంటున్నారు. ఏపీ సంగతి ఇలావుంటే విభజన తర్వాత ఆదాయంలో 2వ స్థానాన్ని ఆక్రమించిన తెలంగాణలో రాబడి గణనీయంగా తగ్గిపోతోందన్న వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు రైతుల ఆత్మహత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీనిపై విపక్షాలు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ప్రస్తుతం డబ్బుల కోసం తంటాలు పడుతున్నట్లు సమాచారం. దీంతో టి.ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చి ఎలాగైనా నిధులు రాబట్టాలన్న కృతనిశ్చయంతో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు చెపుతున్నారు. 
 
ఆదాయం - ఖర్చుల మధ్య తారతమ్యం సరిగా లేకపోవడంతో  పది వేల కోట్ల మేర ఈ ఏడాది బాండ్ల అమ్మకం ద్వారా రుణాలు సేకరించిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి బాండ్ల రిలీజ్ కు సిద్ధమవుతోందని చెపుతున్నారు. ఉద్యోగుల సిబ్బంది పెన్షన్లు మినహా మరే చెల్లింపులు చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని చెబుతున్నారు.