శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By selvi
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2015 (20:07 IST)

అమరావతి రాజధాని నిర్మాణం... ప్రజలకా.. ప్రజా ప్రతినిధులకా? రగులుతున్న మంట...

అమరావతి రాజధాని నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. భూసేకరణే వివాదానికి దారితీస్తోంది. రాజధాని నిర్మాణమంతా కృష్ణా నది చుట్టూ ఏర్పాటు కానుంది. కృష్ణానదిని ఆనుకుని 80 కిలోమీటర్ల మేర రాజధాని నిర్మాణం ఉంటుంది. కృష్ణా నది చుట్టూ కెనాల్ పార్కులు, ఐల్యాండ్ రెస్టారెంట్లు, ఐలాండ్ థీమ్డ్ పార్కులు సర్వాంగ సుందరంగా నిర్మితం కానున్నాయి. సింగపూర్, చైనా, జపాన్‌ నిపుణులతో ఫెంగ్ షుయ్, వాస్తు సూచనల మేరకు రాజధాని నిర్మాణం కానుంది. 
 
అయితే రాజధాని నిర్మాణానికి 4,227 ఎకరాలు అవసరమని మాస్టర్ ప్లాన్‌లో పేర్కొన్నారు. ఇందులో ఏకంగా 2,861 ఎకరాలను ప్రైవేట్ కంపెనీలకే కేటాయించారు. ప్రభుత్వ పరిపాలన భవనాలకు 150 ఎకరాలు సరిపోతుందని.. బిజినెస్ పార్కులు, వాణిజ్య అవసరాలకు ఏకంగా 2,861 ఎకరాలను కేటాయిస్తున్నారు. 
 
ముఖ్యంగా ఈ మొత్తం భూమిని ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు అభివృద్ధి పేరుతో 99 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వనున్నారు. భూములిచ్చే రైతులకు కేపిటల్ బయట మూడు అంతస్థుల భవనాల్లో నివాసాలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలో పేర్కొన్నారు. 
 
విశాలమైన రోడ్లను నిర్మించేందుకు 693 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం తేల్చేసింది. రాజధాని ప్రాంతంలో సమీకరించిన భూములు కాకుండా కేవలం రోడ్ల విస్తరణకు 693 ఎకరాలు కావాలని ప్రభుత్వం భావిస్తోంది. సింగపూర్ ప్రణాళికను అనుసరించి విజయవాడ నుంచి అమరావతి వరకూ, మంగళగిరి నుంచి అమరావతి వరకూ మొత్తం 88 కిలోమీటర్ల మేర ఐదు కేటగిరీలుగా రోడ్లను నిర్మించేందుకు కసరత్తు మొదలైంది. 
 
అయితే రాజధాని నిర్మాణానికి భారీ భూములు అవసరం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. రైతుల నుంచి బలవంతంగా లాక్కోకుండా భూసేకరణ చేయాలని జనసేన చీఫ్ పవన్ మొత్తుకుంటున్నా.. టీడీపీ నేతలు కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. ఇంకా సంవత్సరానికి మూడు పంటలు పండే భూముల్ని లాక్కుంటే.. వ్యవసాయానికి ఏమీ వుండవని వారు వాపోతున్నారు. అయితే టీడీపీ సర్కారు మాత్రం అవన్నీ ఏమీ పట్టించుకోకుండా తన పనేంటో తాను చేసుకుంటూ పోతోంది. 
 
రైతుల నుంచి లాగేసుకుని నిర్మించే రాజధాని ఇంతకీ ప్రజలకా? ప్రజా ప్రతినిధులకా? అనే అనుమానం కలుగుతోంది. రాజధాని ప్రాంతంలో ప్రజాప్రతినిధులకు 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా గల ఫ్లాట్స్ ఇస్తారని తెలుస్తోంది. ఏపీ సర్కారులోని ప్రతి ఒక్క నాయకుడికీ లగ్జరీ ఫ్లాట్స్ రెడీ అవుతున్నాయట. 
 
ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించి.. కేంద్రం నిధులతో హ్యాపీగా నిర్మాణాలు చేపట్టి.. ఫ్లాట్స్‌లో ప్రజా ప్రతినిధులు విలాసవంతమైన జీవితాన్ని గడపాలని చూస్తున్నారని.. రాజధాని కోసం తమ భూములను ఇచ్చేస్తున్న రైతులకు మాత్రం కేపిటల్ బయట నివాసం ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. క్యాపిటల్ నిర్మాణం ఎలా ఉందో ఏమో కానీ ప్రైవేట్ సంస్థలు, రాజకీయ నేతలను రక్షించే విధంగానే రాజధాని నిర్మాణం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.