శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By యిమ్మడిశెట్టి వెంకటేశ్వర రావు
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2015 (15:54 IST)

విజన్ 2020 స్మార్ట్ ఆంధ్రా... పర్యాటక కేంద్రంగా ఏపీ... సీఎం చంద్రబాబు టార్గెట్...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సమున్నత స్థానానికి తీసుకెళ్లి ఏపీ ఆదర్శవంతమైన, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలపాలన్నదే. విభజన దెబ్బతో కుదేలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండో ఏడాదిలోనే భారతదేశంలో పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రాల జాబితాలో ద్వితీయ స్థానం ఆక్రమించేలా చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఆయన తీసుకున్న నదుల అనుసంధానం నిర్ణయం భారతదేశ చరిత్రలో ఓ మైలురాయి. 
 
గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరవును తరిమేయాలన్నదే ఆయన లక్ష్యం. ఇందుకోసం ఎన్ని సవాళ్లు ఎదురైనా అధిగమించి పట్టిసీమను సమర్థవంతంగా పూర్తి చేసి వినాయక చవతికి ముందు రోజునాడు కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉండాలన్నదే ఆయన ధ్యేయం. ఇందుకుగానూ ఆయన అనుసరిస్తున్న విధానాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చినప్పుడు వాటిని పరిశీలించిన నిపుణులు శభాష్ అంటున్నారు.  
 
ఆయన ఇటీవలే విడుదల చేసిన పర్యాటక విధానం 2015-20, పూర్తిగా అమలుకు నోచుకుంటే ఆంధ్రలో అడుగుపెట్టిన పర్యాటకుడికి గొప్ప అనుభూతిని కలిగిస్తుదనడంలో అతిశయోక్తి కాదు. ఏపీ టూరిజం అభివృద్ధిలో భాగంగా బీచ్ ప్రక్కనే టెంట్లు, జమ్ముతో అందమైన చిన్నచిన్న ఇళ్లును నిర్మిస్తారు. ఇక్కడ పర్యాటకులకు అవసరమైన ఆహారం తదిరవన్నీ సమకూర్చుతారు. అవన్నీ కోస్టల్ రెగ్యులైజేషన్ జోన్ నియమాలను అనుసరించి ఉంటాయి. ఇవన్నీ విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు సముద్ర తీరాల్లో ప్రధానమైన రేవుల వద్ద నిర్మించనున్నారు. 
 
ఇంకా కృష్ణా, గోదావరి నదుల్లో పడవ ప్రయాణం, ఇంకా ఇతర జల క్రీడల కేంద్రాలను నిర్మించి పర్యాటకులకు మంచి ఆహ్లాదాన్ని కల్గిస్తారు. సముద్రం-నది కలిసే ప్రాంతంలో విహరించేందుకు పెద్దపెద్ద ఓడలను కూడా అందుబాటులోకి తెస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవులు తక్కువేమీ కాదు. అలాగే కొండలు, గుట్టలు కూడా ఉన్నాయి. పర్యాటకులకు అనుకూలమైన ప్రాంతాలను ఎంపిక చేసి వాటిపై ట్రెక్కింగ్, సైక్లింగ్, రాక్ క్లైంబింగ్ వంటివి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
సుందరమైన కొండలపై రోప్ వేలను నిర్మించి పర్యాటకులకు మంచి అనుభూతిని కల్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫార్మ్ టూరిజంలో కూరగాయలు, పౌల్ట్రీ, గుర్రపు స్వారీ, ఫార్మ్స్ వద్ద షాపింగ్ చేసే అవకాశాన్ని పర్యాటకులకు కల్పిస్తారు. ఇంకా రూరల్ టూరిజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. కొండపల్లి బొమ్మల గురించి తెలియని వారుండరు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో విశిష్టత ఉంది. వాటన్నిటినీ పర్యాటకులు చూసి ఆనందించే విధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధివిధానాలను రూపొందించారు. 2020 నాటికి తాము అనుకున్నవన్నీ ఆచరణలో పెడుతామని ఆయన చెపుతున్నారు.