గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Modified: మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (09:43 IST)

సవరణ పేరుతో బీజేపీకి బాబు ఝలక్... టిడిడి బోర్డు నియామకంలో భారీ మార్పులు

పది నెలలుగా ఊరిస్తున్న తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి నియామకంలో భారీ మార్పులు జరిగాయి. ఊహించని రీతిలో చాలా మంది పేర్లో అసలు జాబితాలో లేనేలేవు. టిటిడి బోర్డు నియామకం కోసం బాబుపై భారతీయ జనతాపార్టీ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే భారతీయ జనతాపార్టీ ఒత్తడి కంటే స్వంత పార్టీలో ఒత్తిడి పెరిగింది. దీంతో భారతీయ జనతాపార్టీ ప్రతిపాదించిన చాలా పేర్లకు బాబు ఎగనామం పెట్టారు. ఇప్పటికి 11 మంది సభ్యులు మాత్రమే ఉన్న బోర్డులో 18 మందికి పెంచారు. ఇంకా సభ్యుల సంఖ్యను పెంచాలంటే ఖచ్చితంగా కెబినెట్ ఆమోదం కావాలనే నెపంతో చాలా ప్రతిపాదిత పేర్లను పక్కన పెట్టేశారు. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకాన్ని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీనికి సంబంధించి జీవో నెం.147ను జారీ చేసింది. పది నెలల పాటు వూరించినా... ముందే వూహించినట్లు మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తినే తితిదే పాలక మండలి అధ్యక్షునిగా నియమించారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీకి సిద్ధపడ్డ చదలవాడకు టికెట్‌ ఇవ్వలేదు. తితిదే ఛైర్మన్‌ చేస్తానని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆ మేరకు తితిదే ఛైర్మన్‌ పదవిని ఆయనకు ఇచ్చారు. 
 
కానీ, ఈ సారి పాలకమండలి కాలపరిమితి కేవలం ఏడాదికే కుదించారు. ముందుగా ఎన్నో పేర్లు వినిపించనప్పటికీ చివరికి తుది జాబితాలో కొత్త ముఖాలకు చోటు కల్పించారు.  అనూహ్యంగా తిరుపతికి చెందిన బోత్‌ ఆసుపత్రి నిర్వాహకుడు పి.హరిప్రసాద్‌ను పాలకమండలిలో సభ్యుడిగా చోటు కల్పించారు. సినీ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ సిఫార్సు మేరకు ఆయనకు బోర్డులో సభ్యత్వం కల్పించినట్లు ప్రచారం జరుగుతోంది. 
 
కొద్ది రోజులుగా తితిదే ట్రస్టుబోర్డు నియామకంపై ఛైర్మన్‌ పేరు తప్ప సభ్యులుగా ఎందరో పేర్లు తెరమీదకు వచ్చాయి. అయినా వాటిలో ఎప్పటికప్పుడు మార్పులు చేశారు. అదిగో ఇదిగో అంటూ వూరించిన తితిదే ట్రస్టుబోర్డులో ఛైర్మన్‌ పేరు తప్ప కొందరి సభ్యుల పేర్లు వూహించని కూడా దర్శనమిచ్చాయి. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డిని ముందుగా బోర్డు సభ్యుడిగా నియమించారనే ప్రచారం జరిగింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈయన పేరును ప్రతిపాదించారు. తీరా ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులలో ఆయన పేరు కనిపించలేదు.  22 మంది సభ్యులతో బోర్డు వెలువడుతుందని భావించారు. అయితే బోర్డులో కేవలం 18 మంది సభ్యులకే పరిమితం చేశారు. 
 
నీతూ అంబానీ పేరుతోపాటు చిలకం రామచంద్రారెడ్డి వంటి పేర్లను వెలుగులోకి వచ్చాయి. అయితే వారికెవ్వరికీ తొలివిడదత విడుదలైన జాబితాలో వీరి పేర్లు లేవు. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి విధేయులుగా ఉన్న వారి పేర్లను మాత్రమే తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అదనంగా సభ్యులను చేర్చాలంటే చట్టంలో సవరణ తీసుకురావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఆర్డినెన్స్‌ ద్వారా సవరణ తెచ్చి భానుప్రకాష్‌ రెడ్డితోపాటు పలువురి పేర్లను సభ్యులుగా చేర్చుతారని సమాచారం. మరి ఆర్డినెన్సు తీసుకువస్తారో శాశ్వతంగా పక్కన పెడతారో వేచి చూడాల్సిందే.