గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By IVR
Last Modified: సోమవారం, 21 జులై 2014 (17:12 IST)

సీమాంధ్ర రాజధాని... హుండీ పెట్టించారు... బొచ్చె పట్టించరు కదా...

చంద్రబాబు నాయుడు తీరుపై ఇపుడు ప్రధాన ప్రతిపక్షం ఎర్రచందనాన్ని చూపిస్తూ సెటైర్లు వేస్తుంటే జనం మాత్రం సచివాలయంలో బాబు సర్కారు పెట్టించిన రాజధాని నిర్మాణానికి హుండీ పెట్టించిన వ్యవహారంపై చర్చించుకుంటున్నారు. అధికారంలోకి రాగానే అవి చేస్తాం ఇవి చేస్తాం... ఒక్క సంతకంతో రుణమాఫీ చేసేస్తాం అని ఇచ్చిన చంద్రబాబు హామీ రోజుల్లెక్కన పెరుగుతూ ముందుకు పోతోంది.
 
ఇదిలావుండగానే సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటూ చెప్పిన చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం కోసం తాజాగా సెక్రటరీయేట్‌లో హుండీ పెట్టించడంపై సీమాంధ్ర ప్రజల్లో ఒక రకమైన చర్చకు దారి తీసింది. సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు ఇలా దేశంలో హుండీలు పెట్టించి నిధులు పోగేయాలనుకోవడం ఏంటంటూ వారు చర్చించుకుంటున్నారు. ఇలా హుండీ పెట్టించడంతో పరువు పోయిందని సీమాంధ్రలో చాలామంది నోట వినబడుతున్న మాట.
 
ఏదో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చింది కనుక చంద్రబాబు నాయుడు తన పలుకుబడితో సీమాంధ్రను సింగపూర్ చేస్తారనుకుంటే ఇపుడు హుండీలు పెట్టించి ఈ అడుక్కోవడం ఏంటి మాస్టారూ అని ఉదయంపూట రచ్చబండల వద్ద రచ్చ కూడా జరుగుతోంది. మొత్తమ్మీద ఎన్నికల సమయంలో హామీల వరద గుప్పించిన చంద్రబాబు నాయుడు వాస్తవ రూపంలోకి వచ్చేసరికి వాటిని నెరవేర్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. 
 
ఇది మాత్రం ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి మొనదేలిన బాణంలా మారింది. జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే రుణమాఫీ గురించి ప్రజల వద్దకెళ్లి తాను ఆనాడే చెప్పానంటూ తెలియజేస్తున్నారు కూడా. మరి చంద్రబాబు నాయుడు రుణమాఫీతో పాటు సీమాంధ్రను సింగపూర్ ఎలా చేస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు.