శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PYR
Last Modified: శుక్రవారం, 6 ఫిబ్రవరి 2015 (13:40 IST)

‘పెట్రో’ ఉత్పత్తులపై అపరచాణుక్యుడి ‘వ్యాట్’ నీతి

అపరచాణుక్యుడు చంద్రబాబుకు ఆర్థిక లోటు చుక్కలు చూపిస్తోంది. తన చాణుక్య నీతి ఆయనను తిప్పి కొడుతోంది. తాజాగా ఆయన చేస్తున్న చర్యలు అన్నీ ఆయనపై వ్యతిరేకతను పెంచుతున్నాయి. తాజాగా పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తో జనాన్ని చావగొట్టి చెవులు మూసే పని మొదలు పెట్టాడు. అపరచాణుక్యుడుగా పేరొందిన చంద్రబాబు అనేక విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. ఇటు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేక, అటు ఆర్థిక లోటు భరించలేక జనాన్ని పీక్కుతినే ప్రణాళికలకు సిద్ధం చేసేస్తున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా ఆయన కేసీఆర్  ను చూసి పన్నుల భారం మోపుతున్నారు. 
 
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర గణనీయంగా పడిపోయింది. దీంతో అయిల్ కంపెనీలు విధిగా పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించాల్సిన స్థితి ఏర్పడింది. ఆరు నెలల కిందట దాదాపు దాదాపు రూ. 80 వద్ద ఉన్న పెట్రోల్ ధర పలుమార్లు తగ్గి రూ. 61 పడిపోయింది. ఇక డీజల్ అయితే రూ. 50కు పడిపోయింది. ఇక్కడే పెద్ద మతలబు ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గతంలో పెరిగిన లెక్కలను పరిగణలోకి తీసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ప్రకారం డీజల్, పెట్రోల్ ధర మరో ఇంచుమించు చెరి పదేసి రూపాయలు తగ్గాలి. కానీ, కేంద్రం ఆ మొత్తాన్ని పన్నుల రూపంలో జనంపై మోపింది. ఈ మేరకు కనీసం 20 వేల కోట్ల రూపాయలు కేంద్రం తమ ఖజానాలో వేసుకున్నట్లు సమాచారం. 
 
సరిగ్గా అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ రూపంలో కొంత భారాన్ని ప్రజలపై మోపుతూ, కొంత సొమ్మును రాబట్టుకున్నారు. అప్పట్లో ధరలు పెద్దగా తగ్గడంతో తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత ఎదురుకాలేదు. ఇందుకు కారణం అప్పటికే పెట్రోల్ ధరలతో విసిగిపోయిన జనానికి ఆ తగ్గుదలే చాలా ఊరట అనిపించింది. అయితే అప్పట్లో అపరచాణుక్యుడిగా పేరు పొందిన చంద్రబాబు అప్పట్లో మిన్నకుండిపోయారు. అందరూ చాలా సంతోషించారు. విద్యుత్తు సరఫరాను చాలా సక్రమంగా చేసిన చంద్రబాబు పెట్రో ఉత్ప్తత్తులపై కూడా చాలా తెలివిగా వ్యవహరించారని అనుకున్నారు.
 
అయితే ప్రస్తుతం ఉన్నట్లుండి జనం నెత్తిన పిడుగు వేశారు.  తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో రూ. 1.5 వరకూ పెంచితే చంద్రబాబు వ్యాట్ రూపంలో రూ. నాలుగు రూపాయలు రాబడుతున్నారు. నిన్నటికి నిన్న కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజల్ ధరలపై రూ. 2.5 తగ్గిస్తే చంద్రబాబు దానిని తగ్గించకపోగా, మరో రూ.1.5 కలిపి ధరను డీజల్ రూ. 54.5, పెట్రోల్ రూ. 65 ఇంచుమించుగా నిర్ణయిస్తున్నారు. మనకు కేంద్రం పెట్రోలు, డీజల్ సరఫరా చేస్తుంటే దానిపై ఆంధ్ర ప్రభుత్వానికి రూ. 4 చెల్లించాలన్నమాట. ఇదేనా మన ముఖ్యమంత్రి చంద్రబాబు చాణుక్య నీతి అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.