గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (17:30 IST)

ప్రత్యేక హోదాపై భిన్న ప్రకటనలు : టీడీపీ - బీజేపీ నేతల్లో ఐక్యత ఎక్కడ.. లక్ష్యం సాధ్యమేనా?

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఇటు అధికార టీడీపీ, అటు మిత్రపక్షమైన బీజేపీ నేతలు భిన్న ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయంలో పడేస్తున్నారు. తద్వారా తమలో ఐక్యత లేదనే విషయాన్ని చాటిచెపుతున్నారు. పైపెచ్చు.. కొందరు టీడీపీ నేతలు వాస్తవానికి విరుద్ధంగా ప్రజలను మభ్యపెట్టేలా వ్యాఖ్యలు చేస్తూ మీడియా ముందు ఫోజులివ్వడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
 
 
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని లోక్‌సభ సాక్షిగా కేంద్ర ప్రణాళికా శాఖామంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ పునరుద్ఘాటించారు. ఈ ప్రకటన చేసే సమయంలో సభలోనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ మంత్రిగారి వ్యాఖ్యలు ఎంపీలకు వినిపించలేదు. అందుకే దిష్టిబొమ్మల్లా తమతమ సీట్లకు పరిమితమైపోయారు. 
 
అదేసమయంలో ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి ప్రకటనతో తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో వరుస వార్తాకథనాలు ప్రసారం కావడంతో టీడీపీ, బీజేపీ నేతలు నిద్రమేల్కొన్నారు. ఆ తర్వాత తమకు తోచిన విధంగా.. తమ ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తూ మీడియాకు ఫోజులిస్తున్నారు. ఇలాంటి వారిలో టీడీపీ రాష్ట్ర మంత్రులు ఒక అడుగు ముందున్నారనే చెప్పాలి. 
 
రావు ఇంద్రజిత్ సింగ్ ప్రకటన చేసిన వెంటనే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కేంద్రం ఉద్దేశ్యాన్ని తేటతెల్లం చేస్తూనే.. ప్రత్యేక హోదా రాదనే విషయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా బాగా తెలుసుని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేశారు. ఇదే విషయం చంద్రబాబు పార్టీ ఎంపీలతో జరిగిన అంతర్గత సమావేశంలో కూడా వెల్లడించినట్టు వినికిడి. అందుకే కేంద్రంతో సఖ్యతగా ఉండి నిధులను రాబట్టుకోవాలని సూచించారు కూడా. 
 
ప్రత్యేక హోదాపై వాస్తవ పరిస్థితి ఇలావుంటే టీడీపీకి చెందిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఒక అడుగు ముందుకేసి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే రాజీనామా చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, తమ రాజీనామాల వల్ల ప్రత్యేక వస్తుందా అని ప్రజలను ప్రశ్నించారు. పైపెచ్చు.. ప్రస్తుత పరిస్థితిలో బీజేపీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయనే సెలవిచ్చారు. 
 
ఇక బీజేపీ నేతల విషయానికి వస్తే.. యూపీఏలో కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్ర విభజనకు వంతపాతపాటి ఇపుడు బీజేపీలో చేరిన దగ్గుబాటి పురంధేశ్వరి సరికొత్త భాష్యం చెపుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని ఎక్కడ కూడా సూటిగా చెప్పలేదని, ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం కృషి చేస్తూనే ఉందన్నారు. పైపెచ్చు రాష్ట్రానికి కావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు టీడీపీ సర్కారు చొరవచూపుతూ, లౌక్యం ప్రదర్శించాలంటూ హితవు పలికారు. ఎలాంటి లౌక్యం ప్రదర్శించాలో ఈమెగారే సెలవివ్వాల్సి ఉంది. 
 
అలాగే, బీజేపీకే చెందిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మరోలా సెలవిచ్చారు. రావు ఇంద్రజిత్ సింగ్ లోక్‌సభలో చేసిన ప్రకటన బీహార్‌ను ఉద్దేశించి చేసినవని అవి ఏపీకి వర్తించవని వివరించారు. ఈ విషయంలో ప్రజల్ని అయోమయానికి గురిచేయొద్దని సూచించారు. పైపెచ్చు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలనూ నెరవేరుస్తామని, ఇరు రాష్ట్రాలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. 
 
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి చెందిన మంత్రులు, ఎంపీలు ఒకలా స్పందిస్తుంటే.. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, మంత్రులు మరోలా స్పందిస్తూ.. ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. తద్వారా ప్రత్యేక హోదా అంశంపై రచ్చ మరింత తీవ్రతరమయ్యేలా ప్రవర్తిస్తున్నారు. అదేసమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించేందుకు కావాల్సిన ఐక్యత తమలోనే లేదని ప్రజలకు తెలియజేస్తూ.. విమర్శలపాలవుతున్నారు. ఏ రాజకీయ నేత అయిన విపక్షంలో ఉన్నపుడు ఓ మాట.. అధికారంలోకి వచ్చాక మరోమాట చెప్పడం వారి అవకాశవాద రాజకీయాల్లో ఓ భాగం. ఇపుడు అదే రాజకీయ క్రీడకు సీమాంధ్ర ప్రజలను బలి చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.