శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: శుక్రవారం, 22 జులై 2016 (20:21 IST)

హోదా బిల్లుకు బీజేపీ చిల్లు... బ‌తుకు జీవుడా అనుకున్న ఇద్దరు నాయుడులు!

ఢిల్లీ: ప‌్ర‌త్యేక హోదాపై కేవీపీ ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌యివేటు బిల్లు చ‌ర్చ‌కు రాకుండా బీజేపీ పెద్ద చిల్లు పెట్టింది. అందులోంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఇద్ద‌రు నాయుడులు... బ‌తుకు జీవుడా అంటూ చ‌క్క‌గా త‌ప్పించుకున్నారు. బీజేపీ గేమ్ ప్లాన్ స‌క్సెస్ కావ‌డ

ఢిల్లీ: ప‌్ర‌త్యేక హోదాపై కేవీపీ ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌యివేటు బిల్లు చ‌ర్చ‌కు రాకుండా బీజేపీ పెద్ద చిల్లు పెట్టింది. అందులోంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఇద్ద‌రు నాయుడులు... బ‌తుకు జీవుడా అంటూ చ‌క్క‌గా త‌ప్పించుకున్నారు. బీజేపీ గేమ్ ప్లాన్ స‌క్సెస్ కావ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఇద్ద‌రూ ఎవ‌రో కాదు... ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, కేంద్రమంత్రి ఎం.వెంక‌య్య నాయుడు. 
 
ఏపీకి ప‌దేళ్ళ పాటు ప్ర‌త్యేక హోదా కావాల‌ని, పార్ల‌మెంటులో సుదీర్ఘ ఉప‌న్యాసం ఇచ్చి ఆంధ్రుల నుంచి మార్కులు కొట్టేసిన వెంక‌య్య‌నాయుడుకు కేవీపీ ప్ర‌వేశ పెట్టిన ప్ర‌యివేటు బిల్లు క‌ట్లపాములా క‌నిపించింది. ఆ రోజు ప్ర‌తిప‌క్షంలో ఉండి, తెలుగువాడిగా రెచ్చిపోయి ప్ర‌సంగించిన వెంక‌య్య‌, బీజేపీ ఇలా పూర్తి స్థాయిలో అధికారంలోకి వ‌స్తుంద‌ని అప్ప‌ట్లో ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చు. ఇపుడు అధికారంలోకి వ‌చ్చాక‌, బీజేపీ రెండు నాలుక‌ల ధోర‌ణి అవ‌లంభిస్తోంద‌ని, ప్ర‌త్యేక హోదా క‌న్నా మంచి ప్యాకేజీ ఇస్తామంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని ఇప్ప‌టికే ఏపీలో ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. ఆ రోజు బీజేపీ ఆడింది పెద్ద నాట‌కం అని, ఇపుడు ప్ర‌త్యేక హోదాపై మాట మారుస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. 
 
మ‌రోప‌క్క ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏపీ విభ‌జ‌న‌కు అప్ప‌ట్లో అనుకూలంగా త‌లూపి, ఇప్పుడు ఇది తాము కోరుకున్న‌ది కాద‌ని చెప్పుకొస్తున్నారు. ప్ర‌త్యేక హోదా కోసం తాము చిత్త‌శుద్ధితో కేంద్రంతో పోరాడుతున్నామ‌ని, చాలాసార్లు తాను ఢిల్లీ వెళ్ళి ప్ర‌ధాని మోదీని ప్ర‌శ్నిస్తూనే ఉన్నాన‌ని వివ‌ర‌ణ ఇస్తూనే ఉన్నారు. ఇపుడు హ‌ఠాత్తుగా కేవీపీ ప్ర‌ైవేటు బిల్లు తేవ‌డంతో నోట్లో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డిన‌ట్ల‌యింది. బిల్లును వ్య‌తిరేకిస్తూ... టీడీపీ ప్ర‌త్యేక హోదాకు వ్య‌తిరేకం అని అంద‌రికీ అర్ధం అయిపోతుంది. బిల్లుకు అనుకూలంగా ఓటేస్తే, కేంద్రంలో బీజేపీకి వ్య‌తిరేకం అయిపోతారు. ఇలా రెండు వైపులా ఇరుక్కుపోయిన చంద్ర‌బాబు... ఈ గండం నుంచి ఎలా గ‌ట్టెక్కాలా అని తల పట్టుకున్నారు. 
 
కేవీపీ మామూలుగా ఎక్కువ‌గా మాట్లాడే మ‌నిషి కాదు... ఇలా మాటామంతీ లేకుండా, కాల్చి క‌డ్డీ పెట్టిన‌ట్లు ప్ర‌యివేటు బిల్లును ప్ర‌వేశ పెట్టి, చ‌ల్ల‌గా కూర్చున్నాడు. దీనివ‌ల్ల పార్టీల అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డుతుంద‌ని, బీజేపీ నేత వెంక‌య్య‌, ఏపీ సీఎం చంద్ర‌బాబుల‌కు షాక్ ఇవ్వొచ్చ‌ని కేవీపీతోపాటు కాంగ్రెస్ నేత‌లంతా భావించారు. ప్ర‌యివేటు బిల్లు వ‌ల్ల ఒరిగేది ఏమీ ఉండ‌ద‌ని కాంగ్రెస్ పెద్ద‌ల‌కూ తెలుసు. కానీ, పార్టీల‌కు బుద్ధి చెప్పి, కాంగ్రెస్ మ‌ళ్ళీ ఏపీలో పాగా వేయాల‌న్న‌ది, నేత‌ల చిర‌కాల వాంఛ‌. అందుకే ప్ర‌యివేటు బిల్లుపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. 
 
కానీ, బీజేపీ పెద్ద‌లు వీరంద‌రిక‌న్నా... నాలుగు ఆకులు ఎక్కువే చ‌దివారు. తొలుత బీజేపీ అధిష్ఠానం ఈ ప్ర‌యివేటు బిల్లుకు వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని, స‌భ్యులంద‌రికీ విప్ జారీచేసి మ‌రీ చెప్పాల‌ని భావించింది. ఇలా చేసి ఉంటే, ఎన్డీఏ భాగ‌స్వామ్య పార్టీ టీడీపీ ఇరుకునప‌డిపోయేది. హోదాకు అనుకూలంగా ఓటు చేస్తే, బీజేపీకి దూరం అయ్యేది. మ‌రోప‌క్క ఇక్క‌డ బీజేపీ పెద్ద‌గా చెలామ‌ణి అవుతున్న వెంకయ్య‌నాయుడికీ ఇది ఇబ్బందిక‌ర ప‌రిణామం. 
 
అందుకే ఇద్ద‌రు నాయుడులు త‌మ బాధ‌ను బీజేపీ అధిష్ఠానం ముందు వెళ్ళ‌గ‌క్కినట్లు సమాచారం. ఏదోలా కేవీపీ ప్ర‌యివేటు బిల్లు అస‌లు చ‌ర్చ‌కు రాకుండా, ఓటింగ్ ప్ర‌స‌క్తే లేకుండా చూడాల‌ని వేడుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో కేంద్ర బీజేపీ నాయ‌క‌త్వం చ‌క్రం తిప్పింది. ఎంపీ భ‌గ‌వంత్ మాన్ సింగ్ వీడియో, వంటి అప్ర‌ధాన అంశాల‌పై ఎడ‌తెగ‌ని చ‌ర్చ‌లు జ‌రిపి, హోదా బిల్లు మాత్రం చ‌ర్చ‌కు రాకుండా వాయిదా వేయించారు. దీనితో ఏపీలో ఇద్ద‌రు నాయుడులు ఊపిరి పీల్చుకున్నారు.