గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: బుధవారం, 29 జూన్ 2016 (15:46 IST)

హైదరాబాద్ వదిలేందుకు మొదట ఏడ్చారు... ఏపీకి వచ్చాక పులకరించిపోతున్నారు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సచివాలయ ఉద్యోగులు వారంతా. తొలుత అమరావతి రాజధానికి వచ్చేది లేదని భీష్మించారు. ఏర్పాట్లు సరిగా లేవంటూ పెదవి విరిచారు. భవనాలు లేకుండా ఎక్కడ కూర్చుని తాము పనులు చేయాలంటూ నిలదీశారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సచివాలయ ఉద్యోగులు వారంతా. తొలుత అమరావతి రాజధానికి వచ్చేది లేదని భీష్మించారు. ఏర్పాట్లు సరిగా లేవంటూ పెదవి విరిచారు. భవనాలు లేకుండా ఎక్కడ కూర్చుని తాము పనులు చేయాలంటూ నిలదీశారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్తంత అసహనం వ్యక్తం చేశారు కూడా. ఏదేమైనప్పటికీ జూలై నెల నుంచి పూర్తిస్థాయిలో సచివాలయం ఉద్యోగులు అమరావతి నుంచే పనులు చేయాలంటూ ఆయన స్పష్టం చేశారు. 
 
దీనితో చేసేది లేక హైదరాబాద్ సచివాలయ భవనం నుంచి ఖాళీ చేసేసి అన్నీ సర్దుకుని ఇక్కడకి వచ్చేముందు పలువురు ఉద్యోగులు బస్సు ఎక్కి వెక్కివెక్కి ఏడ్చారు. హైదరాబాద్ నగరాన్ని ఇక వదిలేసి వెళ్తున్నందుకు లోలోన మధనపడిపోతూ కుమిలికుమిలి ఏడ్చారు. ఆ సంఘటనల తాలూకూ వీడియోలు, చిత్రాలు మీడియాలో హల్ చల్ చేశాయి కూడా. కానీ ఆ తర్వాత ఏడ్చి రాత్రంతా బస్సులోనే నిద్రపోయి తెల్లారేసరికి ఏపీలో కాలుపెట్టినవారికి ఇక్కడ ఉద్యోగులు పలికిన స్వాగతంతో పులకించిపోయారు. 
 
ఆ బాధంతా ఎటుపోయిందో... ఎంతో ఆనందంగా విధుల్లోకి చేరిపోయేందుకు సిద్ధమైపోయారు. ఇక్కడ లభిస్తున్న ఆదరణతో సచివాలయ ఉద్యోగులు ఎంతో సంతోషంగా హైదరాబాద్ నగరాన్ని వదిలేసి రాత్రి 11 బస్సుల్లో ఇక్కడికి వచ్చేశారు. వీరికి ఘన స్వాగతం లభించింది. మరోవైపు ఏపీ రాజధానికి తరలి వెళ్లే విషయంలో హైదరాబాద్ వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవో పని చేస్తున్న పద్మ హైదరాబాద్ నుంచి బెజవాడకు సైకిల్ మీద వచ్చారు. 
 
ఆమె విజయవాడకు చేరుకోగానే ఇక్కడి ఉద్యోగులతో పాటు ఏకంగా మంత్రులే ఆమెకు ఘన స్వాగతం పలుకడంతో ఏపీ రాజధాని వాతావరణం ఒక్కసారి ఉత్సాహభరితంగా మారిపోయింది. పద్మ రాకను పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఉద్యోగులు, స్థానికులు కేరింతలు కొడుతూ చప్పట్లతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. మొత్తమ్మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకున్నట్లుగా సచివాలయం ఉద్యోగలంతా హైదరాబాదు నగరాన్ని వదిలేసి ఇక్కడకు రావడం ఆయనకు పెద్ద రిలీఫ్.