గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ESHWAR
Last Updated : బుధవారం, 30 జులై 2014 (11:32 IST)

జగన్ పార్టీ వైకాపా 'గీత' మారుతోందా?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం ముదురుతోంది. కొంతకాలంగా చాపకింద నీరులా ఉన్న విభేదాలు రోడ్డునపడుతున్నాయి. ప్రజాప్రతినిధులుగా ఎన్నికై పట్టుమని మూడు నెలలు తిరక్కముందే ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య ఆధిపత్యపోరాటం ఆరంభమైంది. ఇందుకు అరకు పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారిపోయింది. నాలుగు జిల్లాల్లోని... .ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అరకు పార్లమెంటరీ స్థానం విస్తరించి వుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచిపట్టు ఉండటంతో ఆరు అసెంబ్లీ సీట్లను ఆ పార్టీ ఎగరేసుకుపోయింది. అరకు ఎంపీగా కొత్తపల్లి గీత భారీ మెజార్టీతో గెలిచారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. 
 
ఎమ్మెల్యేలు స్థానికులు కావడం... ఎంపీగా ఎన్నికైన గీత వేరే ప్రాంతం నుంచి రావడంతో మనస్పర్థలు మొదలయ్యాయి. పైగా, కొత్తపల్లిగీత ఆధిపత్య ధోరణి.... పార్టీలో సీనియర్ నేతలకు సైతం రుచించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేలు గ్రూపు రాజకీయాలు నడుపుతూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. తాజాగా, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.... ఎంపీ గీతల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. అధినేత జగన్మోహన్ రెడ్డిపై గీత నిరసనగళం విప్పడాన్ని ఈశ్వరి బహిరంగంగానే తప్పుబట్టారు కూడా. 
 
ఎమ్మెల్యే లేకుండానే చింతపల్లిలో అధికారిక కార్యక్రమాలను గీత నిర్వహించడం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. ఎంపీ వ్యవహారశైలిపై ఎమ్మెల్యే ఈశ్వరి వర్గం తీవ్రస్థాయిలో స్పందిస్తోంది. ఈ వివాదం ఒక్క పాడేరుకే పరిమితం కాలేదని.... అన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్యం పోరాటం ఎక్కువైందని మాచారం. రంపచోడవరం ఎమ్మెల్యే వంతలరాజేశ్వరి.... పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.... కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిలు.... ఎంపీకి దూరంగా వుంటున్నారు. 
 
పాలకొండ ఎమ్మెల్యే కళావతి.... సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరలకే కాదు పార్టీని నడుపుతున్న సీనియర్ నేతలతో గీతకు వైరం ఉంది. పార్టీలో సీనియర్ నేత అండదండలు ఉండటంతో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాత్రం స్వేచ్చగా నియోజకవర్గంలో పని చేసుకోగలుగుతున్నారు. ఒకవైపు, సొంతపార్టీలో వర్గ రాజకీయాలు నడుపుతున్న కొత్తపల్లి గీత.... తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా మెలిగేందుకు ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. రెండురోజుల క్రితం రాష్ట్రమంత్రి అయ్యన్న పాత్రుడితో ఆమె భేటీ కావడంతో ఏదో జరుగుతుందన్న ఊహాగానాలు చెలరేగాయి. ఈ సస్పెన్స్‌కు తెరపడక ముందే అరకు ఎంపీ... ముఖ్యమంత్రితో సమావేశమవ్వడం ఆసక్తికరంగా మారింది. 
 
పార్టీలో ఆత్మాభిమానం కోసమే పోరాడుతున్నానని జగన్ పిలిస్తే వెళ్లి కలుస్తానని అంటున్న గీత.. తెగే వరకూ లాగుదామన్న ధోరణిలోనే వున్నట్టు తెలుస్తోంది. స్పష్టమైన హామీ ఇస్తే వైసీపీలో ఉండాలి. లేదంటే చంద్రబాబు చెంతకి చేరాలన్న ఆలోచనలో కొత్తపల్లి గీత ఉన్నట్టు ఆ వైఖరి ద్వారా తెలుస్తోంది.