శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (13:01 IST)

పాక్‌ని ఏకాకిని చేద్దాం... ఇదీ మోదీ ఫార్ములా... 72% ప్రజలు పాకిస్తాన్‌పై యుద్ధమంటున్నారే...?

న్యూఢిల్లీ: ఉగ్ర పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టి... ఏకాకిని చేసేందుకు వ్యూహాత్మకంగా ముందడుగు వేయాలని భారత్ నిర్ణయించింది. పాక్ ప్రోత్సాహంతో సాగుతున్న ఉగ్రవాదంపై చర్యలు తీసుకొనేలా తగినన్ని ఆధారాలు సమర్పించి, ఆ దేశాన్ని ప్రపంచంలో

న్యూఢిల్లీ:  ఉగ్ర పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టి... ఏకాకిని చేసేందుకు వ్యూహాత్మకంగా ముందడుగు వేయాలని భారత్ నిర్ణయించింది. పాక్ ప్రోత్సాహంతో సాగుతున్న ఉగ్రవాదంపై చర్యలు తీసుకొనేలా తగినన్ని ఆధారాలు సమర్పించి, ఆ దేశాన్ని ప్రపంచంలో ఒంటరి చేసేలా ఒత్తిడి పెంచేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. 
 
ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై పాక్ ఉగ్రనీతిని బయట పెట్టాలని భేటీలో తీర్మానించారు. ఉగ్రవాదులు వాడిన పాక్ తయారీ ఆయుధాలు, ఆహారం, శక్తినిచ్చే పానీయాలు, భారత్‌లో ప్రవేశించేందుకు ఉపయోగించిన జీపీఎస్ పరికరాల్ని పాక్‌కు అందచేసి ఆ దేశాన్ని గట్టిగా నిలదీయనుంది. ఈ బాధ్యతను సైనిక కార్యకలాపాల డెరైక్టర్ జనరల్‌కు అప్పగించారు. యూరి ఉగ్రదాడి అనంతరం ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించేందుకు నిర్వహించిన ఈ కీలక సమావేశంలో హోం మంత్రి రాజ్‌నాథ్, రక్షణ మంత్రి పరీకర్, ఆర్థిక మంత్రి జైట్లీ, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దాడి అనంతరం కశ్మీర్ లోయలో తాజా పరిస్థితిని అధికారులు ప్రధానికి వివరించారు.
 
దాడి సూత్రధారుల్ని శిక్షించకుండా వదిలిపెట్టబోమంటూ ఆదివారం ప్రధాని చెప్పడంతో ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేయొచ్చన్న ఊహాగానాలకు తెరలేచింది. అయితే ఎలాంటి తొందరపాటు చర్యకూ ప్రభుత్వం సిద్ధంగాలేదని ఉన్నత వర్గాల సమాచారం. ఇప్పటికిప్పుడు అలాంటి చర్య ఏదీ ఉండదని, పూర్తిస్థాయి వ్యూహరచన, సహకారం, అన్ని అనుకూలతల్ని పరిశీలించి, అందర్నీ సంప్రదించాకే చర్యకు ముందడుగు వేయాలనే నిర్ణయానికి వచ్చారని ఆ వర్గాలు తెలిపాయి. 
 
గతేడాది జూన్‌లో మణిపూర్‌లో ఎన్‌ఎస్‌సీఎన్-కే తీవ్రవాదులు 18 మంది సైనికుల్ని చంపిన అనంతరం భారత ఆర్మీ మయన్మార్ సరిహద్దులు దాటి వెళ్లి చేసిన దాడి చేయడం తెలిసిందే. అన్ని అనుకూలతలు పరిశీలించాకే వారం తర్వాత ఈ దాడి జరిపారు. తీవ్ర భావావేశాలు, ఆగ్రహాన్ని పరిగణనలోకి తీసుకుని ఎలాంటి చర్య ఉండదని విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ కూడా స్పష్టం చేశారు. మరోవైపు యూరి ఉగ్రదాడి పరిణామాలపై రాష్ట్రపతి ప్రణబ్‌కు ప్రధాని మోదీ వివరించారు. ఉన్నత స్థాయి భేటీ తర్వాత రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ను కలిశారు. యూరి దాడిపై తగిన సమయంలో, తగిన చోట గుణపాఠం చెబుతామని ఆర్మీ పేర్కొంది.
 
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సమీక్ష
సరిహద్దులతో పాటు జమ్మూ కశ్మీర్‌లో భద్రతా పరిస్థితిపై హోం మంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలో రక్షణ మంత్రి పరీకర్, ఉన్నత భద్రతా అధికారులు ప్రత్యేకంగా చర్చించారు. నియంత్రణ రేఖ, కశ్మీర్ లోయలో తాజా పరిస్థితిని భద్రతా సలహాదారు దోవల్, ఆర్మీ చీఫ్, హోం, రక్షణ, పారా మిలటరీ దళాల ఉన్నతాధికారులు రాజ్‌నాథ్‌కు వివరించారు.
 
ఐతే తెలుగు వెబ్ దునియా నిర్వహించిన పోల్‌లో పాకిస్తాన్ దేశం పైన యుద్ధం చేయాల్సిందేనంటూ 72 శాతం మంది అభిప్రాయపడ్డారు. 28 శాతం మంది ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా పాకిస్తాన్ దేశం పైన ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. అమెరికన్ సర్వేలోనూ ఇదే స్పష్టమైంది.