మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2015 (14:02 IST)

ఆహా... బాబు గారు భేష్...! ఓహో వెంకయ్య సూపర్..!! అసలు తెర వెనుక ఏం జరుగుతోంది...?

ఆహా.. బాబు గారిలాంటి నేత ఆంధ్రప్రదేశ్‌‌కు ముఖ్యమంత్రి కావడం రాష్ట్రానికి గర్వకారణమని.. ఆయన దార్శనికత కలిగిన నేతని వెంకయ్య నాయడు చంద్రబాబును ఆకాశానికెత్తేశారు.. ఇక బాబుగారేం తక్కువ తినలేదు. వెంకయ్య నాయుడులాంటి వ్యక్తి కేంద్రంలో ఉండడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టమని, విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ తరపున ఆయన అభిమన్యుడిలా పోరాడడని, ఆయన అక్కడ ఉండేంత వరకూ ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరగబోదంటూ పండరీ భజన వేశారు. ఇదంతా గురువారం ఉదయ తాడేపల్లె గూడెంలో జరిగిన నిట్ భవన శంఖుస్థాపన సభలో జరిగింది. ఎన్నడూ లేని విధంగా వీరిద్దరూ వ్యక్తిగత పొగడ్తలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం చర్చకు దారి తీస్తోంది. తెరవెనుక ఏం జరుగుతోంది.? సంబంధమే లేని వెంకయ్య నాయుడు ఈ సభకు ఎందుకు వచ్చారు..? అనే అంశంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. 
 
ప్రత్యేకహోదా చర్చ జోరుగా సాగుతోంది. ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి మోదీలు 25న కలువనున్నారు. ఈ నేపథ్యంలో రంగం సిద్ధమవుతోంది. అయితే ఇదే సమయంలో చాలా కాలం తరువాత కేంద్రం మంత్రులతో కలసి భవన సముదాయానికి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వాస్తవానికి స్మృతి ఇరానీ సంబంధిత మంత్రి కావడంతో సభకు విచ్చేయడంలో ఆశ్చర్యం ఏమి లేదు. అయితే కర్ణాటక కోటాలో రాజ్యసభకు ఎంపికైన వెంకయ్య నాయుడు ఈ సమావేశానికి ఎందుకు హాజరైనట్లు అనేది అనుమానం. ఆయన కార్యక్రమానికి కాకుండా ప్రత్యేకహోదాపై చర్చ జరపబోయే ముందు చంద్రబాబుతో మాట్లాడడానికి వచ్చిన దూతగా విశ్లేషకులు భావిస్తున్నారు. 
 
ముందుగానే కేంద్రం ఏమిస్తుందో.. రాష్ట్రం తీసుకోవాలో సూత్రప్రాయంగా మాట్లాడడానికే వెంకయ్యను ప్రధాని మోదీ ఇక్కడకు పంపినట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికలు త్వరలోనే ఉన్న కారణంగా ప్రత్యేక హోదాపై పట్టుబట్టకుండా మిన్నకుండాలని నచ్చజెప్పి రావాలని చెప్పి పంపినట్లు తెలుస్తోంది. ప్యాకేజీ, హోదా వంటి అంశాలను కొన్నాళ్ళు పక్కపెడితే బాగుంటుందని నచ్చజెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రధానితో ఏమి చర్చించాలి? దేనికి ఒప్పుకోవాలని అనే అంశాలను కూడా సూత్రప్రాయంగా ఇక్కడే చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుకే ఈ ఇద్దరు సభపేరుతో కలసినట్లు తెలుస్తోంది. 
 
ఈ సందర్భంగానే చంద్రబాబు వెంకయ్యను పొగడ్తలతో ముంచెత్తారు. వెంకయ్య ఢిల్లీలో ఉన్నంత వరకు... వెంకయ్య నాయుడు ఢిల్లీలో ఉన్నంత వరకు ఏపీకి అన్యాయం జరగదని తనకు నమ్మకం ఉందని చంద్రబాబు అన్నారు. విభజన సమయంలో రాజ్యసభలో వెంకయ్య పోరాటం అద్భుతమన్నారు. రాజ్యసభలో వెంకయ్య అభిమన్యుడిలా పోరాడారన్నారని తెలిపారు.  
 
అందుకు ప్రతిగా వెంకయ్య కూడా బాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు సవాళ్లను ఎదుర్కోగల దిట్ట అని, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత గల నేత, శక్తిసామర్థ్యాలు, క్రమశిక్షణ ఉన్న నాయకుడు అని వెంకయ్య స్తుతించారు.  ఏపీలో చంద్రబాబు ఎన్నిక గర్వకారణమన్నారు. ఇలాంటి పరస్పర పొగడ్తల వెనుకున్న సారాంశం హోదాపై భేటీ సామరస్యంగా జరగాలనే పరమార్థంగా ఉన్నట్లు తెలుస్తోంది.