శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2015 (11:31 IST)

తెలుగు సినీ ఇండస్ట్రీ అంతా.. కేసీఆర్‌ను పొగుడుతుందట.. కారణం ఏమైవుంటుంది?

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా.. తెలంగాణ సర్కారును పొగుడుతుందని, సీఎం కేసీఆర్ పథకాలపై సినీ రంగం ప్రశంసల వర్షం కురిపిస్తోందని టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ గొప్పలు చెప్పుకుంటున్నారు. హైదరాబాదులో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎక్కడెక్కడి నుంచి పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారన్నారు. అయితే హైదరాబాదులో పరిస్థితులు బాగాలేవని, సెక్షన్-8 అమలు చేయాలని ఏపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఏపీ నేతలపై సుమన్ మండిపడ్డారు. ఆంధ్రా నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం లేనట్టుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
 
అయితే సినీ ఇండస్ట్రీ మొత్తం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించేందుకు కారణం లేకపోలేదని.. రాజకీయ పండితులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఓటుకు నోటు కేసులు ఇరికించి.. రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసిన వీరుడు ధీరుడు కేసీఆర్ అంటూ మాటలొస్తున్న తరుణంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సెక్షన్ 8తో కొత్త చిక్కులు తెచ్చుకున్న... కేసీఆర్‌ను సినీ పెద్దలంతా పొగడటానికి కారణం.. వేరే గత్యంతరం లేకనేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ తెలంగాణకు సీఎం కావడం ఏమిటి.. ఆయనకు మర్యాద ఇవ్వడం ఏమిటనే చందంగానే సినీ పెద్దలంతా మనసులో అనుకుంటూ పైకి మాత్రం కేసీఆర్‌పై గొప్పలు చెప్పేస్తున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో అన్నీ అనుకూలిస్తే.. సినీ ఇండస్ట్రీనే అక్కడకు షిఫ్ట్ చేయాలనుకున్న సినీ పెద్దలంతా బాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడంతో.. ఏపీ అభివృద్ధి చాలా దూరంలో ఉండటంతో చేసేది లేక, వేరే గత్యంతరం లేక.. కేసీఆర్‌ను పొగుడుతూ కాలం గడిపేస్తున్నారని సినీ పండితులు కూడా అభిప్రాయపడుతున్నారు. 
 
రాజకీయాల్లో అందరూ దొంగలేనని.. పని కావాలంటే కేసీఆర్‌నే కాదు.. ఆయన స్థానంలో ఎవరున్నా పొగడక తప్పదని బస్తీ ఆడియో ఫంక్షన్‌కు హాజరైన పలువురు గుసగుసలాడుకున్నట్లు భోగట్టా. ఇకపోతే.. ఇటీవల బస్తీ సినిమా ఆడియో ఫంక్షన్‌లో కేసీఆర్‌పై దర్శకరత్న దాసరి నారాయణ రావు ప్రశంసల జల్లు కురిపించారు. ఇదే తరహాలో ఇదే కార్యక్రమానికి హాజరైన పలువురు నేతలు కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.