గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ESHWAR
Last Updated : బుధవారం, 6 ఆగస్టు 2014 (18:46 IST)

ఖమ్మంలో ఇండస్ట్రియల్ పార్కులు..(?)

ఖమ్మం జిల్లా అపార ఖనిజ సంపదకు నిలయం. ఇప్పటికే.. సింగరేణి బొగ్గు గనుల వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. బయ్యారం ఉక్కు పరిశ్రమను త్వరలో సాకారం చేస్తామని సర్కారు చెబుతోంది. వీటితోపాటుగా.. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులోభాగంగా ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు కోసం అనువైన ప్రాంతాలను అన్వేషించి పనిలో అధికారులు పడ్డారు.
 
ఖనిజ సంపదకు ఆలవాలం...
జిల్లా ఖనిజ సంపదకు పట్టుగొమ్మగా మారింది. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లి పట్టణాలు బొగ్గు ఉత్పత్తికి ఇప్పటికే కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. బయ్యారంలో విస్తృత స్థాయిలో ఐరన్‌ఓర్‌ నిల్వలున్నాయి. గ్రానైట్‌ పరిశ్రమలు భారీ సంఖ్యలోనే ఉన్నాయి. పాల్వంచ, సత్తుపల్లి, నేలకొండపల్లి, ఇల్లందు, బూర్గంపాడు, ముదిగొండ ప్రాంతాల్లో ఇతర అనేక రకాల ఖనిజాలున్నాయి. 
 
1970 దశకంలో జిల్లాలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు అప్పటి ప్రభుత్వం ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసింది. ఆరేళ్ల క్రితం తల్లాడ మండలం అన్నారిగూడెం వద్ద పదిహేను ఎకరాల్లో కాటన్ పార్కును ఏర్పాటు చేశారు. జిన్నింగ్ మిల్లులు ప్రస్తుతం అక్కడ నిర్మాణంలో ఉన్నాయి. సత్తుపల్లి వద్ద 300 ఎకరాల్లో మామిడి రైతుల కోసం ఫుడ్ పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి అనుబంధంగా అనేక చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.
 
అనుకున్న స్థాయిలో జరగని అభివృద్ధి...
ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసినప్పటికీ అనుకున్న తరహాలో అభివృద్ధి జరగలేదు. దీంతో కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మం పట్టణాల్లో 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్‌ పార్కుల్లో కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. మిగిలిన స్థలాలు ఖాళీగా ఉన్నాయి. కొత్తగూడెంలో ఇండస్ట్రియల్‌ ఏరియాకు సంబంధించిన వందలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయి.
 
దృష్టిసారించిన టీ సర్కార్...
తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలోని ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుపై దృష్టి సారించింది. చిన్నతరహా పరిశ్రమల నిర్మాణానికి స్థలాలను సేకరించే దిశగా జిల్లా అధికారులకు, పరిశ్రమల శాఖకు ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. దీంతో ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో 12 వేల ఎకరాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాలు చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. 
 
త్వరలో దీనిపై తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సమగ్రంగా ప్రణాళికను సిద్ధం చేసే అవకాశం ఉంది. విద్యుత్తు, నీటి సరఫరాతోపాటు ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న ఖమ్మం జిల్లాలో చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తే యువతకు పెద్ద మొత్తంలో ఉపాధి లభించే అవకాశం ఉంది.