శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : సోమవారం, 9 జూన్ 2014 (18:14 IST)

అమ్మా అంటూ పలకరించిన కొద్దిసేపటికే అనంతలోకాలకు...

హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో ఆదివారం చోటు చేసుకున్న ప్రమాదం ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. ముఖ్యంగా.. ఈ ఘటన దేశాన్ని నివ్వెర పోయేలా చేసింది. డ్యామ్ సిబ్బంది ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా రిజర్వాయర్ నుంచి నీటిని ఒక్కసారిగా విడుదల చేయడంతో విహార యాత్రకు వెళ్లి.. నది ఒడ్డన ఫోటోలు తీసుకోవడంలో లీనమైన హైదరాబాద్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థుల్లో అనేక మంది గల్లంతు అయ్యారు. ఇలా గల్లంతు అయిన వారిలో ఇప్పటి వరకు ఐదు మృత దేహాలను మాత్రమే వెలికి తీశారు. మిగిలిన వారి ఆచూకీ తెలియరాలేదు. 
 
అయితే, గల్లంతు అయిన వారి కోసం గజ ఈతగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలా గల్లంతు అయిన విద్యార్థుల్లో కరీంనగర్ జిల్లా వాసి శ్రీనిధి కూడా ఉండటంతో ఆమె తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. విజ్ఞాన్ జ్యోతి కళాశాలలో రేకుర్తి గ్రామానికి చెందిన శ్రీనిధి ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. విహార యాత్రకు వెళ్తానంటే ఈ నెల 3న తానే స్వయంగా పంపించానని ఆమె తండ్రి రాజిరెడ్డి చెప్పారు. ఆదివారం సాయంత్రం శ్రీనిధి ఫోన్‌లో మాట్లాడిందని, ఆ తర్వాత కాసేపటికే విద్యార్థులు గల్లంతు అయ్యారన్న వార్త టీవీలో చూడగానే తీవ్ర ఆందోళనకు గురయ్యామన్నారు. ఇప్పటి వరకు తమ కుమార్తె ప్రాణాలతో ఉన్నట్టు తమకెలాంటి సమాచారం లేదన్నారు. 
 
కాగా, బియాస్ నదిలో గల్లంతైన హైదరాబాదులోని వి.ఎన్.ఆర్. విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థుల వివరాలను పేట్ బషీరాబాద్ ఏసీపీ వెల్లడించారు. గల్లంతైన విద్యార్థుల్లో రిషితారెడ్డి, రిదిమ, విజేత, రిత్విక్, ఉపేందర్, పరమేశ్వర్, తరుణ్, సాయిరాజ్, శివప్రకాశ్ వర్మ, విష్ణువర్ధన్, దేవాశిష్ బోస్, సందీప్, జగదీశ్, సాధిర్, అరవింద్, మాచర్ల అనిల్, మిట్టపల్లి అఖిల్, రాంబాబు, ఆశిష్, శ్రీహర్ష, కిరణ్‌కుమార్‌లు ఉన్నారని ఆయన తెలిపారు. పర్యటనకు వెళ్లిన వారిలో 48 మంది విద్యార్థులు, ముగ్గురు అధ్యాపకులు ఉన్నారని ఆయన వివరించారు.