గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : ఆదివారం, 13 సెప్టెంబరు 2015 (20:00 IST)

అందరి చూపు బీహార్ వైపే.. నరేంద్ర మోడీకి మరో పరాభవం తప్పదా?

బీహార్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల నగారా మోగింది. దీంతో ప్రతి ఒక్క రాజకీయ నేత చూపు బీహార్‌పైనే కేంద్రీకృతమై వుంది. ఈ ఎన్నికలు జనతా పరివార్‌కు బీజేపీ కూటమికి మధ్య సమరంగా భావిస్తున్నారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వెల్లడైన ఫలితాలే ఇక్కడ కూడా పునరావృతం కావొచ్చన్న ఊహాగానాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల ఫలితాలపై నిర్వహించిన ముందస్తు సర్వే ఫలితాలు కూడా జనతా పరివార్‌ వైపే మొగ్గు చూపుతున్నాయి. దీంతో అందరి దృష్టి బీహార్ వైపే కేంద్రీకృతమైంది. 
 
వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల్లో మొదలైన బీజేపీ జైత్రయాత్రకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బ్రేకులు వేశాయి. దేశ రాజధానిలో కమలనాథులకు ఘోర పరాజయం.. మోడీ ఇమేజ్‌ని ఆకాశం నుంచి నేల మీదకు దించింది. దీంతో తాజా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మోడీ ప్రతిష్టకు మరోసారి సవాలు విసురుతున్నాయి. బీహార్‌లో గెలుపు మోడీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. మోడీ బద్ధశత్రువులు, లాలూ, నితీశ్, కాంగ్రెస్ ఏకతాటిపైకి వచ్చి ఆయనకు సవాల్ విసురుతున్నాయి. వీరికి కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి ప్రముఖులు మద్ధతు పలుకుతున్నారు. ఢిల్లీలో ఓటమి తర్వాత... మోడీపై విరుచుకుపడుతున్న ప్రత్యర్థులకు చెక్ పెట్టాలంటే బీహార్‌లో బీజేపీ గెలుపు తప్పనిసరిగా మారింది. 
 
బీహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ... ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే.. నాలుగు భారీ బహిరంగ సభలు నిర్వహించారు. బీహారీలను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ లక్షన్నర కోట్ల రూపాయల విలువ చేసే ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించారు. దీంతోపాటు రానున్న రోజుల్లో రాష్ట్రం నలుమూలల్ని కవర్ చేసేలా మోడీతో 12 భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. బీహార్ బీజేపీలో రవి శంకర్ ప్రసాద్, సుశీల్ మోడీ, షానవాజ్ హుస్సేన్, శతఘ్న సిన్హా  సీనియర్ నేతలు చాలామంది ఉన్నా.. జనాన్ని ఆకర్షించేందుకు మోడీ మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
అదేసమయంలో జనతా పరివార్ పేరిట మహాకూటమిగా ఏర్పడిన నితీష్ కుమార్ (జనతాదళ్), లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ), సోనియా గాంధీ(కాంగ్రెస్)లు ఒకే వేదికను పంచుకుంటూ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మొత్తం సీట్లలో జేడీయు, ఆర్జేడీలు చెరో వంద సీట్లలో పోటీ చేయాలని నిర్ణయిస్తే.. మిగిలిన సీట్లను కాంగ్రెస్, ఇతర పార్టీలకు కేటాయించనున్నారు. అదేసమయంలో ఈ ఎన్నికల్లో మోడీకి ఎదురుగాలి తప్పదన్న సంకేతాలను ముందస్తు ఎన్నికల సర్వేలు హెచ్చరిస్తున్నాయి.